Dematerialisation: పాత షేర్ సర్టిఫికెట్ కనిపించిందా..?దాన్ని వదిలేస్తే నష్టపోయినట్టే..!

పాత ఇంటిని బాగు చేస్తున్నప్పుడో, బీరువాలు, పెట్టెలను సర్దుతున్నప్పుడో మన తాత, తండ్రుల నాటి అనేక వస్తువులు బయటపడుతుంటాయి. వాటిలో పాత ఫొటోలు, ఆనాటి వస్తువులు, పాత షేర్ సర్టిఫికెట్లు కూడా దొరుకుతుంటాయి. ఫొటోలు, వస్తువులను దాచుకున్నా పాత షేర్ సర్టిఫికెట్లను మాత్రం బయట పడేస్తుంటారు. ఎందుకంటే అవి ఇప్పుడు పనికిరావని భావిస్తారు. ప్రస్తుతం డీమ్యాట్ ఖాతాల ద్వారానే షేర్ల అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నాయి. లావాదేవీలన్నీ ఆన్ లైన్ లోనే పూర్తవుతున్నాయి. అయితే పాత షేర్ సర్టిఫికెట్ల వాటాలను కూడా ప్రస్తుతం డీమ్యాట్ ఖాతాలోకి జమ చేసుకోవచ్చు. ఆ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Dematerialisation: పాత షేర్ సర్టిఫికెట్ కనిపించిందా..?దాన్ని వదిలేస్తే నష్టపోయినట్టే..!
Share Market

Updated on: Jun 18, 2025 | 4:15 PM

పెట్టుబడిదారులు తమ షేర్లు, సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపంలో డీమ్యాట్ ఖాతాలో దాచుకుంటారు. దీని వల్ల భౌతిక పత్రాల అవసరం ఉండదు. సెక్యూరిటీలు, షేర్లను కొనుగోలు చేయడం, అమ్మడం చాాలా సులభంగా జరుగుతుంది. మీరు షేర్లు కొంటే డీమ్యాట్ ఖాతాలో జమ అవుతాయి. విక్రయిస్తే మీ ఖాతా నుంచి బయటకు వెళ్లిపోతాయి. ఇదంతా నేటి ఆధునిక ప్రక్రియ. గతంలో షేర్లను సర్టిఫికెట్ల రూపంలో అందజేసేవారు. అలాంటి పాత షేర్లను డీమెటీరియలైజేషన్ ద్వారా డీమ్యాట్ ఖాతాలో జమ చేయవచ్చు.

  • పాత షేర్ సర్టిఫికెట్లను, భౌతిక వాటాలను డీమెటీరియలైజేషన్ ద్వారా డీమ్యాట్ ఖాతాలోకి మార్చుకోవడం చాలా ముఖ్యం.
  • మీ షేర్లకు మెరుగైన భద్రత లభిస్తుంది. భౌతికంగా ఉంటే దొంగతనం, నష్టం, పోర్జరీ జరిగే అవకాశం ఉంటుంది. వాటిని ఎలక్ట్రానిక్స్ రూపంలో మార్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
  • మీ వాటాలను చాలా సులభంగా పర్యవేక్షించుకోవచ్చు. అన్నింటినీ ఒకే చోట చూడవచ్చు. తద్వారా పోర్టుఫోలియో నిర్వహణ సజావుగా జరుగుతుంది.

డీమెటీరియలైజేషన్ గురించి చాలామందికి తెలియదు. దీంతో పాత షేర్ సర్టిఫికెట్లను నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలాంటి వారికి ఆన్ లైన్ బ్రోకింగ్ యాప్ అయిన జెరోదా సాయం చేస్తుంది. కేవలం మూడు దశల ప్రక్రియతో భౌతిక షేర్లను డీమెటీరియలైజేషన్ చేసుకోవచ్చు. దీని కోసం అవసరమైన పత్రాలను సిద్దం చేసుకోవాలి. ఆన్ లైన్ ధ్రువీకరణ కోసం అన్ని పత్రాలు సమర్పించాలి. అంటే పూర్తి చేసిన డీమెటీరియలైజేషన్ అభ్యర్థన ఫారం (డీఆర్ఎఫ్), పాన్ కార్డు కాపీ, ఒరిజనల్ షేర్ సర్టిపికెట్లు, చిరునామా రుజువు పత్రాలు అందజేయాలి. డాక్యుమెంట్లు అందజేసిన తర్వాత సుమారు 25 రోజుల్లో పని పూర్తవుతుంది. దీని కోసం కొంత చార్జీని జెరోదా యాప్ వసూలు చేస్తుంది. పాత షేర్ సర్టిఫికెట్లను ఎలక్ట్రానిక్ రూపంలో మార్చుకోవడానికి కొన్ని షరతులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా షేర్ సర్టిఫికెట్ ప్రస్తుత కంపెనీ పేరు, ముఖ విలువను ప్రదర్శించాలి. సర్టిఫికెట్ లో పేరు డీమ్యాట్ ఖాతాలోని పేరుతో సరిపోవాలి. వ్యక్తిగత వాటాలను ఉమ్మడి ఖాతాలుగా చేయడం కుదరదు.