Darwin Box: యూనికార్న్ క్లబ్​లో చేరిన హైదరాబాద్​కు చెందిన అంకుర సంస్థ..

|

Jan 26, 2022 | 6:38 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన హెచ్‌ఆర్‌ (మానవ వనరుల) టెక్నాలజీ సేవల్లో నిమగ్నమైన అంకుర సంస్థ డార్విన్‌బాక్స్‌(darwin box), ‘యూనికార్న్‌(unicorn)’ క్లబ్‌లో చేరింది...

Darwin Box: యూనికార్న్ క్లబ్​లో చేరిన హైదరాబాద్​కు చెందిన అంకుర సంస్థ..
darwin box
Follow us on

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు చెందిన హెచ్‌ఆర్‌ (మానవ వనరుల) టెక్నాలజీ సేవల్లో నిమగ్నమైన అంకుర సంస్థ డార్విన్‌బాక్స్‌(darwin box), ‘యూనికార్న్‌(unicorn)’ క్లబ్‌లో చేరింది. సంస్థాగత విలువ 100 కోట్ల డాలర్ల కంటే అధికంగా ఉన్న అంకుర సంస్థలను యూనికార్న్‌లుగా పరిగణిస్తున్నారు. డార్విన్‌ బాక్స్‌ తాజాగా 72 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.538 కోట్లు) మూలధన నిధులు సమీకరించింది. బిలియన్‌ డాలర్ల సంస్థాగత విలువ ప్రకారం ఈ నిధులు లభించినట్లు డార్విన్‌బాక్స్‌ వెల్లడించింది. తద్వారా హైదరాబాద్‌ నుంచి తొలి ‘యూనికార్న్‌’గా ఈ సంస్థ నిలిచింది. హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహించిన కొన్ని అంకుర సంస్థలకు ఇంతకు ముందు ఈ గుర్తింపు లభించింది. అయితే పూర్తిగా స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలైన చైతన్య పెద్ది, జయంత్‌ పాలేటి, రోహిత్‌ చెన్నమనేని కలిసి 2015లో హైదరాబాద్‌లో నెలకొల్పిన, పూర్తిగా ఇక్కడి నుంచే కార్యకలాపాలు విస్తరించిన ‘డార్విన్‌బాక్స్‌’, ‘యూనికార్న్‌’గా గుర్తింపు పొందాయి.

ఈ సంస్థకు టెక్నాలజీ క్రాస్‌ఓవర్‌ వెంచర్స్‌ (టీజీవీ), సేల్స్‌ఫోర్స్‌ వెంచర్స్‌, సిఖోయా, లైట్‌స్పీడ్‌, ఎండియా పార్టనర్స్‌, 3వన్‌4కేపిటల్‌ నిధులు సమకూర్చాయి. ఈ సంస్థ ఇప్పటి వరకు 110 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.825 కోట్ల) మేరకు మూలధన నిధులు సమీకరించింది. తాజాగా లభించిన మూలధనంతో తన వ్యాపార కార్యకలాపాలను బహుముఖంగా విస్తరిస్తామని, నూతన టెక్నాలజీ సేవలు ఆవిష్కరించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు డార్విన్‌బాక్స్‌ పేర్కొంది.

డార్విన్‌బాక్స్‌ ప్రస్తుతం వివిధ దేశాలకు చెందిన 650 సంస్థలకు సేవలు అందిస్తోంది. జేఎస్‌డబ్ల్యూ, అదానీ, మహీంద్రా, వేదాంతా, ఎస్‌బీఐ, జనరల్‌ ఇన్సూరెన్స్‌, కోటక్‌, టీవీఎస్‌, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా, రాంకీ, అరబిందో ఫార్మా, బిగ్‌బాస్కెట్‌, స్విగ్గీ, మేక్‌మైట్రిప్‌.. తదితర సంస్థలకు సేవలు అందిస్తోంది. నూతన తరం సంస్థల్లోని భవిష్యతరం ఉద్యోగులకు అనువుగా ఉత్తమ, అత్యాధునిక టెక్నాలజీని ఆవిష్కరించాలనే లక్ష్యంతో తాము ఈ సంస్థను నెలకొల్పామని జయంత్ చెప్పారు.

ఈ విభాగంలో ప్రపంచస్థాయిలో అగ్రస్థానానికి చేరాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు జయంత్‌ పాలేటి తెలిపారు. ఈ సంస్థ కార్యకలాపాలు ప్రధానంగా హైదరాబాద్​తోపాటు వివిధ దేశాల్లో 12 కార్యాలయాలను నిర్వహిస్తోంది. మొత్తం 700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వచ్చే ఏడాదిలోగా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేస్తామని, ఇందులో ఎక్కువ మందిని హైదరాబాద్‌లోనే నియమిస్తామని కంపెనీ పేర్కొంది.

తెలంగాణ నుంచి సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌) విభాగ అంకుర సంస్థ, ‘యూనికార్న్‌’ కావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని తెలంగాణ ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తెలిపారు. అంకుర సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో మద్దతు ఇస్తోందన్నారు. అన్ని రకాల సదుపాయాలు ఉండటం, నైపుణ్యం కల మానవ వనరుల లభ్యత ఇక్కడ అనుకూలించే అంశాలని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఉన్నందున సంబంధిత పరిశ్రమల నైపుణ్యం, విజ్ఞానం కూడా అంకుర సంస్థల విస్తరణకు దోహదపడుతోందన్నారు.

Read Also… Budget-2022: పీపీఎఫ్ వార్షిక పెట్టుబడి పరిమితి పెంచాల్సిందేనా.. ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారు.