AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ న్యూస్.. చమురు ధరలు ఢమాల్.. ట్రంప్ కీలక ప్రకటనతో ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్..

ఆకాశాన్నంటుతున్న చమురు ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న పశ్చిమ ఆసియాలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన సీజ్ ఫైర్ ఒప్పందం.. గ్లోబల్ మార్కెట్‌ను ఒక్కసారిగా కుదిపేసింది. ముడి చమురు ధరలు ఏకంగా 15 శాతం కుప్పకూలాయి. హోర్ముజ్ జలసంధి తెరుచుకోవడం వల్ల మనకేంటి లాభం..? అనేది తెలుసుకుందాం..

బిగ్ న్యూస్.. చమురు ధరలు ఢమాల్.. ట్రంప్ కీలక ప్రకటనతో ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్..
Crude Oil Prices Crash 15 Percent
Krishna S
|

Updated on: Apr 08, 2026 | 7:32 AM

Share

గత కొంతకాలంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికించగా.. ఇవాళ్టి ట్రంప్ కీలక ప్రకటన ఇంధన మార్కెట్‌కు భారీ ఊరటనిచ్చింది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న అమెరికా, ఇరాన్‌ల మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ చారిత్రాత్మక పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 15 శాతం మేర కుప్పకూలాయి. రెండు వారాల పాటు దాడులు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వెంటనే ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ సుమారు 15.19శాతం తగ్గి, బ్యారెల్‌కు 92.67డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ 15.02శాతం తగ్గి, బ్యారెల్‌కు 96.03 డాలర్ల వద్దకు చేరుకుంది. వంద డాలర్ల మార్కును దాటి ఆకాశాన్నంటుతున్న ధరలు ఒక్కసారిగా దిగిరావడం చమురు దిగుమతి చేసుకునే దేశాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

హోర్ముజ్ జలసంధి ఓపెన్

చమురు ధరలు తగ్గడానికి ప్రధాన కారణం హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని ఇరాన్ తీసుకున్న నిర్ణయం. ప్రపంచ చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరాలో దాదాపు 20 శాతం వాటా ఈ జలమార్గం ద్వారానే జరుగుతుంది. యుద్ధ భయంతో నిలిచిపోయిన ఈ సరఫరా మార్గాన్ని తాత్కాలికంగా పునరుద్ధరించడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అంగీకరించడంతో సరఫరా గొలుసు పుంజుకుంటుందనే ఆశలు చిగురించాయి.

ట్రంప్ కీలక ప్రకటన

ఈ ఉద్రిక్తతలను తగ్గించడంలో పాకిస్థాన్ కీలక మధ్యవర్తిత్వం వహించడం గమనార్హం. ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. నౌకల సురక్షిత ప్రయాణానికి హామీ ఇస్తూనే, కొన్ని సాంకేతిక పరిమితులను అమలు చేస్తామని తెలిపింది. ఈ ఒప్పందం కేవలం అమెరికా-ఇరాన్ మధ్యే కాకుండా లెబనాన్‌లో ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య జరుగుతున్న పోరుపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.

స్థిరత్వం దిశగా ఇంధన మార్కెట్

ఫిబ్రవరి నుంచి చమురు మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితికి ఈ ఒప్పందంతో తెరపడింది. ఏప్రిల్‌లో రోజుకు 9 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి దెబ్బతింటుందని అంచనా వేసిన తరుణంలో, ఈ కాల్పుల విరమణ వార్త ధరలను అదుపులోకి తెచ్చింది. రాబోయే రెండు వారాల పాటు ఈ ఒప్పందం సజావుగా సాగితే అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు మరింత స్థిరపడే అవకాశం ఉంది.

Follow Us