Cow Dung Scheme: జార్ఖండ్ ప్రభుత్వం వ్యవసాయాన్ని పెంచడానికి బడ్జెట్‌లో అనేక ప్రకటనలు చేసింది. అందులో ఆవుపేడ కొనుగోలు పథకం ఒకటి. దీని ప్రకారం రాష్ట్రంలోని పశువుల యజమానుల నుంచి ప్రభుత్వం ఆవు పేడను కొనుగోలు చేస్తుంది. బడ్జెట్‌లో చేసిన ఈ ప్రకటనతో రాష్ట్రంలోని పశుయజమానులు సంబరపడిపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఆవు పేడను కొనుగోలు చేస్తే మంచి ధరలు లభిస్తాయని, తద్వారా తమ సంపాదన పెరుగుతుందని ఆశిస్తు్న్నారు. రైతుల నుంచి ఆవు పేడను కొనుగోలు చేసే పథకాన్ని రాష్ట్రంలో సక్రమంగా అమలు చేస్తే.. దాని వల్ల విస్తృత ఫలితాలు ఉంటాయి. వ్యవసాయ అవసరాలకు ఆవులను లేదా ఎద్దులను ఉపయోగించని రైతులు కూడా పశువులని కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నేడు జార్ఖండ్‌లోని చాలా గ్రామాల రైతులు పశువులని పెంచని పరిస్థితి నెలకొంది. అంతేకాదు ఇప్పుడు ఆవు పాలకే కాకుండా పేడకి కూడా ఆదాయం రావడంతో ఆవుల సంఖ్య కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
జార్ఖండ్‌లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆవు పేడ సేకరణ పథకంతో రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయ ప్రచారం ఊపందుకోనుంది. ఎందుకంటే దీని తర్వాత రాష్ట్ర రైతులకు మరింత అవగాహన ఏర్పడుతుంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన పేడతో బయోగ్యాస్ తయారు చేసి వర్మీ కంపోస్టు తయారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రైతులకు సులభంగా వర్మీ కంపోస్టు అందితే మేలు జరుగుతుంది. సేంద్రియ ఎరువులు సులువుగా అందుబాటులోకి రావడంతో రైతులు సేంద్రియ వ్యవసాయం చేయగలుగుతారు.
జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జార్ఖండ్ రైతులు చాలా సంతోషిస్తున్నారు. ప్రభుత్వం ఆవుపేడ కొనుగోలు నిర్ణయంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఆవు పేడకి మంచి ధర లభించడం ద్వారా వారి ఆదాయం పెరుగుతుంది. రైతులకు ఇప్పుడు ఆవు పేడ, పాలు రెండింటికీ ధర లభిస్తుంది. దీంతో రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. మరోవైపు ప్రభుత్వ ఈ పథకం సక్రమంగా అమలైతే ఆవుల పెంపకానికి ప్రోత్సాహం లభిస్తుందని రైతులు భావిస్తున్నారు.