
మీ వాహనం టైర్ మార్చేటప్పుడు దానిపై రాసిన ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను మీరు ఎప్పుడైనా గమనించారా? కంపెనీలు టైర్లపై ఈ కోడ్‌ను ఎందుకు రాస్తాయి? దీని ద్వారా డ్రైవర్లకు ఏదైనా హెచ్చరిక ఉంటుందా? లేదా దీనికి వేరే అర్థం ఉందా? ఈ కోడ్స్ ద్వారా కంపెనీ పేరు, లోగో కాకుండా టైర్ గురించి కొన్ని ముఖ్యమైన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ద్వారా టైర్ వెడల్పు, టైర్ నిర్మాణ రకం, బరువు, సామర్థ్యం మొదలైన వాటి గురించి తెలుసుకోవచ్చు. వాటిని ఎలా తెలుసుకోవాలో? ఓ సారి చూద్దాం.
ఓ ప్రముఖ కంపెనీకు సంబంధించిన టైర్స్‌లో 195/65ఆర్15కు సంబంధించిన ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ముద్రించి ఉంది. ఈ కోడ్‌లోని మొదటి మూడు అంకెలు టైర్ వెడల్పును సూచిస్తాయి. ఉదాహరణకు ఈ టైర్ వెడల్పు 195 మిల్లీమీటర్లు. ఎక్కువ ఇంజిన్ డిస్‌ప్లేస్‌మెంట్ ఉన్న కార్లు వెడల్పు టైర్లను ఉపయోగిస్తాయి. మెరుగైన రీతిలో శక్తిని బదిలీ చేయడానికి రోడ్డుపై మంచి పట్టు అవసరం. 3000 సీసీ లేదా అంతకంటే ఎక్కువ ఇంజిన్ ఉన్న వాహనాలకు సాధారణంగా వెడల్పు టైర్లు ఉంటాయి.
ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌లో, వెడల్పు తర్వాత వచ్చే రెండంకెల సంఖ్య టైర్ ఎత్తును సూచిస్తుంది. ఉదాహరణకు 195/65ఆర్15 లోని “65” అంటే టైర్ ఎత్తు అంటే ఎత్తు టైర్ వెడల్పులో 65 శాతంగా ఉంటుంది.
ఎత్తు తర్వాత చివరి సంఖ్య టైర్‌కు అంచు వ్యాసాన్ని సూచిస్తుంది. పై కోడ్‌లోని “15” అంటే ఈ టైర్‌ను 15 అంగుళాల అంచుపై మాత్రమే అమర్చవచ్చు.
కోడ్‌లో ఆర్ అని రాస్తే ఆ టైర్ రేడియల్ అని అర్థం. బీ అయితే అది బయాస్ బెల్ట్‌ను సూచిస్తుంది. డీ అయితే అది వికర్ణాన్ని సూచిస్తుంది. ఈ రోజుల్లో దాదాపు అన్ని టైర్లు రేడియల్ అందుకే వాటిలో చాలా వాటిపై ఆర్ అని రాసి ఉంటుంది. పాత టైర్లపై మాత్రమే బీ లేదా డీ గుర్తులు ఉంటాయి.
టైర్ ఎంత గరిష్ట భారాన్ని తట్టుకోగలదో కూడా దానిపై పేర్కొంటారు. ఉదాహరణకు ఈ కోడ్ రాసిన టైర్ దాదాపు 1000 కిలోల లోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
వాహనాల స్వభావాన్ని బట్టి టైర్లపై కొన్ని ప్రత్యేక అక్షరాలు రాసి ఉంటాయి. పి అంటే ప్రయాణీకుల వాహనాలకు, ఎల్‌టీ అంటే తేలికపాటి ట్రక్కులు లేదా తేలికపాటి వాహనాలకు, ఎస్‌టీ అంటే ప్రత్యేక ట్రైలర్ కోసం, టీ అంటే తాత్కాలిక టైర్లకు అని పేర్కొంటారు. ఈ కోడింగ్ ఏ రకమైన వాహనానికి ఏ టైర్ అమర్చాలో గుర్తించడం సులభం చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి