Paytm Board: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం బోర్డులో ఉన్న చైనీయులు అందరూ బయటకు వచ్చేశారు. అలీపే ప్రతినిధి జింగ్ షియాంగ్‌డాంగ్, యాంట్ ఫైనాన్షియల్‌కు చెందిన గూమింగ్ ఛెంగ్, అలీబాబా ప్రతినిధులు మైఖేల్ యెన్ జెన్ యా, టింగ్ హాంగ్ కెన్నీ హోలు సంస్థ డైరెక్టర్ల పదవుల్లో నుంచి తప్పుకోనున్నారు. ఇక వారి స్థానంలోకి భారతీయులు, అమెరికన్లు వచ్చి చేరారు. పేటీఎం పబ్లిక్ ఇష్యూకు రాబోతున్న నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న షేర్ హోల్డింగ్‌ల్లో ఎలాంటి మార్పులు లేవని నియంత్రణ సంస్థలకు కంపెనీ సమాచారం అందించింది.
అమెరికా పౌరుడు డౌగ్లస్ ఫీజిన్ యాంట్ గ్రూప్ తరపున పేటీఎం బోర్డులో చేరిపోయారు. సామా క్యాపిటల్‌కు చెందిన అషిత్ రంజిత్ లిలానీ, సాఫ్ట్ బ్యాంక్ ప్రతినిధి వికాస్ అగ్నిహోత్రి కూడా బోర్డులో చేరారు. బెర్క్‌షైర్ హాథవేలో ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ అయిన టాడ్ ఆంటోనీ కాంబ్స్ పేటీఎం బోర్డు నుంచి గత నెల 30న పదవీ విరమణ చేశారు. అయితే పేటీఎం మాతృ సంస్థ ఒన్97 కమ్యూనికేషన్స్ కాగా, ఇందులో అలీబాబా యాంట్ గ్రూప్ (29.71 శాతం), సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ (19.63 శాతం), సైఫ్ పార్ట్‌నర్స్ (18.56 శాతం), విజయ్ శేఖర్ శర్మ (14.67 శాతం), ఏజీహెచ్ హోల్డింగ్, టి రోవె ప్రైస్, డిస్కవరీ క్యాపిటల్, బెర్క్‌షైర్ హాథవేలు 10 శాతం కంటే తక్కువగా వాటాలు కలిగి ఉన్నాయి. ఐపీఓ ద్వారా రూ.16,600 కోట్ల నిధుల్ని సేకరించేందుకు వాటాదార్ల నుంచి ఈ నెల 12న ఆమోదం లభిస్తుందని పేటీఎం భావిస్తోంది. ఐపీఓ కోసం కంపెనీ విలువను రూ.1.78 లక్షల కోట్లుగా లెక్కగట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ వాల్యుయేషన్ పరిధిలో కంపెనీ టాప్ 10 లిస్టెడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలలో ఒకటిగా ఉంటుందని భావిస్తున్నారు. వచ్చే వారం ప్రారంభం పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కోసం కంపెనీ పత్రాలను దాఖలు చేయాలని భావిస్తున్నారు.