Income Tax Returns Filing Extended: కరోనా నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును పొడిగించింది. 2020 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యక్తుల రిటర్నుల దాఖలు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలతో పాటు కంపెనీలకు సైతం రిటర్నుల దాఖలుకు నవంబర్ 30 వరకు అవకాశం ఇచ్చింది.
కోవిడ్ విజృంభిస్తున్న వేళ అయా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌తో కూడి కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. దీంతో పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) వెల్లడించింది. వ్యక్తులకు ఇప్పటి వరకు రిటర్నుల దాఖలుకు జులై 31, కంపెనీలకు అక్టోబర్ 31గా సీబీడీటీ గడువు ఉండేది. కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసే ఫారం-16 గడువును సైతం సీబీడీటీ పొడిగించింది. జులై 15 వరకు ఇందుకు గడువును నిర్దేశించింది.
ఇదిలావుంటే, ఐటీ రిటర్న్స్ దాఖలు సులభతరం చేసేందుకు కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్‌ను కేంద్ర ఆదాయ పన్ను శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత పోర్టల్ www.incometaxindiaefiling.gov.in స్థానంలో కొత్తపోర్టల్ www.incometaxgov.inను తీసుకొచ్చింది. జూన్ 7 నుంచి ఈ కొత్త పోర్టల్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. అయితే, జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు పాత పోర్టల్ పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉండదని ఐటీ శాఖ పేర్కొంది.
Read Also.. SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. 3 రోజులు ఆ సర్వీసులన్నీ బంద్.. ఎందుకో తెలుసా..?