
బంగారంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పాత గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ స్థానంలో కొత్త పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. రాబోయే రెండు నెలల్లో ఈ కొత్త స్కీమ్ ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. 11 సంవత్సరాల క్రితం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తీసుకొచ్చింది. అయితే అప్పట్లో ప్రభుత్వం దానిపై ఆసక్తిని చూపించలేదు. దీంతో ఇప్పుడు మెరుగైన స్కీమ్ తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రపంచంలోనే భారతీయుల ఇళ్ల్లో బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ఈ బంగారాన్ని వినియోగించుకోవడమే లక్ష్యంగా కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. దీని వల్ల వినియోగదారులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరడమే కాకుండా జాతీయ ఆర్థిక వ్యవస్థపై దిగుమతుల భారం కూడా తగ్గుతుంది.
ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న నగల వ్యాపారులను సేకరణ భాగస్వాములుగా చేయనున్నారు. వీరి ద్వారా మొత్తం 1,000 టన్నుల బంగారాన్ని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారు నిల్వల కంటే ఇది ఎక్కువని చెప్పవచ్చు. పాత బంగారు నగదీకరణ పథకంలో ప్రజల నుండి బంగారాన్ని సేకరించే బాధ్యత బ్యాంకులకు అప్పగించారు. ఇప్పుడు నగల వ్యాపారులు కూడా భాగస్వామ్యం చేయనున్నారు. నగల వ్యాపారులు ప్రజల నుండి బంగారాన్ని సేకరించి దానిని పంపిణీ చేస్తారు. దీని ద్వారా ప్రజలకు బంగారం సులభంగా అందుబాటులోకి రానుంది. దేశంలో బంగారు డిమాండ్‌ను తీర్చడానికి ఈ పథకం ఉపయోగపడనుంది. ఈ పథకం కింద 5 శాతం బంగారాన్ని కూడా ద్రవ్యీకరిస్తే.. దాదాపు ₹8.6 లక్షల కోట్లు మార్కెట్లోకి ద్రవ్య లభ్యత వస్తుందని మార్కె్ట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం 2015లో మొదటిసారిగా బంగారు నగదీకరణ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయడానికి బదులుగా వినియోగదారులు పెట్టుబడి పెట్టేలా అవకాశం కల్పించారు. ప్రజలు తమ బంగారాన్ని బ్యాంకు లాకర్లలో జమ చేసి వాటిపై 2.25 నుండి 2.5 శాతం వరకు వార్షిక వడ్డీ రేటు పొందవచ్చు. అంతేకాకుండా వారి బంగారం సురక్షితంగా ఉంటుంది. వినియోగదారులు తమకు కావలసినప్పుడు తమ బంగారాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. తమ వడ్డీని బంగారం లేదా నగదుగా మార్చుకునే స్వేచ్ఛను కల్పించారు. అయితే ఈ పథకంపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపలేదు. మార్చి 2025 నాటికి కేవలం 38 టన్నుల బంగారాన్ని మాత్రమే సేకరించారు. దీంతో ఈ సారి మార్పులతో కొత్త పథకం తీసుకొస్తున్నారు.