Ethanol News: ఎల్పీజీ గ్యాస్ లేకపోయినా వంట చేసుకోవచ్చు.. ఇథనాల్‌ తీసుకొస్తున్న కేంద్రం.. మారనున్న వంట విధానం..

కేంద్ర ప్రభుత్వం ఇథనాల్‌ను ఇప్పటికే వాహనాల్లో ఇంధనంగా వాడేందుకు ప్రవేశపెట్టింది. అయితే త్వరలో వంట గ్యాస్ కోసం కూడా ఇథనాల్‌ను వాడేలా ప్రణాళికలు లభిస్తోంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది పరీక్షల దశలో ఉండగా.. రాబోయే రోజుల్లో మనం చూడవచ్చు.

Ethanol News: ఎల్పీజీ గ్యాస్ లేకపోయినా వంట చేసుకోవచ్చు.. ఇథనాల్‌ తీసుకొస్తున్న కేంద్రం.. మారనున్న వంట విధానం..
Gas Cooking

Updated on: Jul 20, 2026 | 1:28 PM

దేశవ్యాప్తంగా ఇథనాల్ గురించి గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ ఇటీవల హాట్‌టాపిక్‌గా మారింది. ఈ పెట్రోల్ వాడటం వల్ల వాహనాల సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదముందని, బండి మైలేజ్ కూడా దెబ్బతినే అవకాశముందనే ప్రచారం సాగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం వీటిపై స్పందించి స్పష్టతిచ్చింది. అయితే ప్రస్తుతం వెహికల్స్‌కు ఇంధనంగా వాడుతున్న ఇథనాల్‌ను త్వరలో వంట గ్యాస్ కోసం కూడా వాడేలా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎల్పీజీ స్థానంలో ఇథనాల్ ప్రవేశపెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. త్వరలో వంటగదిలో కూడా ఇథనాల్ అందుబాటులోకి రానుందని చెప్పవచ్చు. ఇదే జరిగితే ఎల్పీజీ గ్యాస్‌పై ఆధారపడటం తగ్గుతుంది. ప్రస్తుతం పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ దీనిపై కృషి చేస్తోంది.

త్వరలో వంటిట్లోకి ఇథనాల్

ఎల్పీజీతో పాటు ఇథనాల్‌ను కూడా ప్రధాన వంట ఇంధనంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్పీజీ స్థానంలో ఇది వాడితే.. 2050 నాటికి దేశం రూ.2 లక్షల కోట్లకు పైగా ఆదా చేసుకోవచ్చు. కేంద్రం ఎల్‌పిజితో పాటు ఇథనాల్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. సెప్టెంబర్ నాటికి ఇథనాల్‌ను వంట కోసం తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. అయితే ఈ విషయమై కేంద్రం అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని విడుదల చేయలేదు. కానీ తెరవెనుక మాత్రం ప్రయత్నాలు జరుగుుతున్నాయి. సాధారణ ప్రజలను ఇథనాల్ వంటను అవలంబించేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు, ఇతర ఆర్థిక సహాయం అందించాలని యోచిస్తోంది. ఇథనాల్ వాడకాన్ని పెంచడానికి, ప్రభుత్వం రాయితీలు, సరఫరా గొలుసులు, పంపిణీ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది. ఈ విధానానికి సంబంధించి ఇథనాల్ సరఫరా పరిశ్రమతో కూడా చర్చలు జరుగుతున్నాయి.

ఇథనాల్‌తో పొయ్యి ఎలా మండుతుంది..?

ఇథనాల్ పూర్తిగా పర్యావరణహితమైన ఇంధనం. ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశంలో ఇథనాల్ ఆధారిత వంట పొయ్యిలను పరీక్షిస్తున్నారనే వార్త వెలువడింది. భారతదేశంలో ఇథనాల్ లభ్యత పెరుగుతోంది. దేశ ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 20 బిలియన్ లీటర్లను దాటింది. ఇథనాల్‌తో పని చేసే వంట గ్యాస్ పొయ్యిలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Follow Us