దేశంలో ప్రస్తుతం పండుగ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ లో బంగారం, ప్రాపర్టీ ఇలా ఎదో ఒకటి కొనడం చేస్తారు. చాలామంది కారును కొనాలని కూడా ప్లాన్ చేస్తుండవచ్చు. ఈ పండగ సీజన్ లో కారు కొనడం శుభపరిణామంగా భావిస్తారు. మీరు కూడా ఈ పండుగ సీజన్‌లో కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే దాని కోసం లోన్ తీసుకోవాలనుకుంటే కారు కోసం సరైన లోన్‌ను ఎలా ఎంచుకోవాలో తెలుసుకోవాలి.
కారు లోన్ తీసుకోవాలి అనుకునే ముందు మీరు మొదటగా వేర్వేరు బ్యాంకుల వడ్డీ రేటు చెక్ చేయండి. ఏ బ్యాంకు ఏ వడ్డీ రేటుకు లోన్ ఇస్తుందో చూడాలి. వివిధ బ్యాంకులు కస్టమర్ల ప్రొఫైల్ – రీపేమెంట్ కెపాసిటీని కాలిక్యులేట్ చేసిన తర్వాత వారికి వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తాయి. వడ్డీ రేట్లలో చిన్న పాటి తేడా కూడా లాంగ్ టర్మ్ లో మీ కారుకు చాలా ఎక్కువ ఖర్చు తీసుకువస్తుందని గుర్తుంచుకోండి. మీ నెలవారీ EMIలో కూడా పెద్ద తేడా రావచ్చు. మీరు మీ కారు లోన్ ఎక్కువ టైం పిరియడ్ పెట్టుకోవద్దు. వీలైనంత తక్కువ వ్యవధికి లోన్ తీసుకోవాలి. సాధారణంగా కారు లోన్‌ను గరిష్టంగా 8 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. కానీ మీరు ఎక్కువ కాలం లోన్ తీసుకుంటే మీకు లోన్ పై ఎక్కువ వడ్డీ పడుతుంది. ఈ వడ్డీ రేటు స్వల్పకాలిక లోన్ అంటే 3 నుంచి 4 సంవత్సరాలు కు విధించే వడ్డీ రేటు కంటే 0.50% వరకు ఎక్కువగా ఉండవచ్చు. లాంగ్ టర్మ్ లోన్ వాహనం ధరను 25% వరకు పెంచవచ్చు.
ప్రీ-క్లోజర్ పెనాల్టీ గురించి జాగ్రత్తగా పరిశిలించండి. కారు లోన్ తీసుకుంటున్నప్పుడు మీరు లోన్ తీసుకుంటున్న బ్యాంక్ ప్రీ-క్లోజర్ పెనాల్టీని విధిస్తుందో లేదో చెక్ చేయాలి. ప్రీ క్లోజింగ్ అంటే లోన్ టర్మ్ కంటే ముందే లోన్ మొత్తాన్ని చెల్లించడం. పెనాల్టీ రేట్లు అన్ని బ్యాంకులకు ఒకేలా ఉండవు. కాబట్టి, మీ బ్యాంకును తెలివిగా ఎంచుకోండి. జరిమానాలు విధించని లేదా చాలా తక్కువ మొత్తాలను వసూలు చేసే బ్యాంకులను లోన్ కోసం సంప్రదించడం చేయండి.
ఇక ప్రాసెసింగ్ ఫీజులు చెక్ చేసుకోండి. దాదాపు ప్రతి బ్యాంకు కార్ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది. కొన్నిసార్లు కొన్ని బ్యాంకులు – ఏజెన్సీలు తక్కువ వడ్డీ రేట్లకు కారు రుణాలు ఇస్తాయి. కానీ లోన్ ఇచ్చే సమయంలో చాలా ఎక్కువ ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేస్తాయి. అందువల్ల, లోన్ తీసుకునే ముందు, లోన్ ప్రాసెస్ చేయడానికి ఎంత ప్రాసెసింగ్ రుసుము వసూలు చేస్తుందో బ్యాంకు నుంచి ముందే తెలుసుకోవాలి.
ఇక ప్రత్యేక ఆఫర్లను చెక్ చేసుకోండి. చాలా బ్యాంకులు పండుగ సీజన్లలో లేదా సంవత్సరంలోని నిర్దిష్ట కాలాల్లో కారు లోన్స్ పై ప్రత్యేక ఆఫర్లను అందిస్తాయి. అలాంటి ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఆఫర్‌లలో ప్రాసెసింగ్ ఫీజులు – ప్రీ-క్లోజర్ పెనాల్టీలపై మినహాయింపు, 100% లోన్, తక్కువ లేదా 0% వడ్డీ రేట్లు, ప్రత్యేక బహుమతి వోచర్‌లు మొదలైనవి ఉంటాయి. మంచి క్రెడిట్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు ఉత్తమమైన డీల్‌లను పొందవచ్చు.
లోన్ కోసం బ్యాంకులు ఏ విషయాలను చూస్తాయో చూద్దాం. లోన్ తీసుకునే వారికీ మంచి ఆదాయ వనరు ఉండాలి. క్రెడిట్ స్కోర్ కూడా బాగుండాలి. తక్కువ క్రెడిట్ స్కోర్ కలిగి ఉండటం వలన లోన్ ఆమోదించే అవకాశాలు తగ్గుతాయి. డాక్యుమెంట్ట్స్ లో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు రుజువు ఉండాలి. చిరునామా రుజువు తప్పనిసరిగా ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, యుటిలిటీ బిల్లు లేదా అద్దె ఒప్పందం వంటి పత్రం అయి ఉండాలి. ఉపాధి రుజువు- బ్యాంక్ స్టేట్‌మెంట్ కూడా అందించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి