ఇల్లు కొనాలా..? అద్దెకు ఉండాలా..? ఏది బెటర్ ఆప్షన్..

ఇల్లు కొనాలా, అద్దెకు ఉండాలా అనే చర్చ యువతలో పెరుగుతోంది. ఈ కథనంలో ఇల్లు కొనడం, అద్దెకు ఉండటం వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలను, వ్యయాలను తెలుసుకుందాం. హోమ్ లోన్ EMI, డౌన్ పేమెంట్, అద్దె చెల్లింపులు, పెట్టుబడి అవకాశాల మధ్య తేడాలను నిపుణుల అభిప్రాయాలతో విశ్లేషిద్దాం..

ఇల్లు కొనాలా..? అద్దెకు ఉండాలా..? ఏది బెటర్ ఆప్షన్..
Buy Vs Rent

Updated on: May 14, 2026 | 6:46 AM

ఇల్లు కొనడం ఒకప్పుడు జీవితంలో పెద్ద లక్ష్యంగా భావించేవారు. సొంతిల్లు అనేది భద్రతకు, స్థిరత్వానికి, సామాజిక గౌరవానికి చిహ్నంగా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువత ఇల్లు కొనడం నిజంగా లాభమా..? లేక అద్దెకు ఉండి పెట్టుబడులు పెట్టడమే తెలివైన నిర్ణయమా..? అని లెక్కలు వేస్తున్నారు.

సొంతింటి కల.. కానీ భారీ EMI భారం

నేటి నగరాల్లో ఇళ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఒక కోటి రూపాయల ఇంటిని కొనాలంటే కనీసం రూ.20 లక్షల డౌన్ పేమెంట్ అవసరం. మిగిలిన రూ.80 లక్షలు బ్యాంకు లోన్‌గా తీసుకుంటే, 20 సంవత్సరాలకు 9% వడ్డీపై నెలకు సుమారు రూ.72,364 EMI చెల్లించాలి. ఈ లెక్క ప్రకారం, 20 సంవత్సరాల తర్వాత బ్యాంకుకు కట్టే మొత్తం దాదాపు రూ.1.93 కోట్లు అవుతుంది. ఇందులో వడ్డీ భాగమే భారీగా ఉంటుంది. దీనికి అదనంగా రిజిస్ట్రేషన్ ఫీజులు, ప్రాపర్టీ ట్యాక్స్, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఉంటాయి.

అద్దె ఇంట్లో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది..?

అదే విలువైన ఇంటిని నెలకు రూ.30 వేల అద్దెకు తీసుకున్నారని అనుకుందాం. ప్రతి ఏడాది 10% అద్దె పెరుగుతుందని భావిస్తే, 20 సంవత్సరాల కాలంలో మీరు అద్దె రూపంలో చెల్లించే మొత్తం రూ.2 కోట్లకు పైగా చేరుతుంది. దీంతో చాలామంది ఇంత డబ్బు అద్దెకు కడితే చివరికి మనకేం మిగలదు అని భావిస్తారు. కానీ ఇక్కడే మరో ముఖ్యమైన లెక్క మొదలవుతుంది.

EMI – Rent మధ్య తేడా పెట్టుబడిగా పెడితే..?

సొంతింటి EMI రూ.72,364 కాగా, అద్దె రూ.30,000 మాత్రమే. అంటే ప్రతి నెలా అదనంగా రూ.42,364 మిగులుతుంది. ఈ మొత్తాన్ని SIP లేదా ఇతర పెట్టుబడుల్లో 9% వార్షిక రాబడితో 20 సంవత్సరాలు పెట్టుబడిగా పెడితే.. దాని విలువ సుమారు రూ.1.57 కోట్లు అవుతుంది. అంతేకాదు.. ఇంటి కోసం పెట్టాల్సిన రూ.20 లక్షల డౌన్ పేమెంట్‌ను కూడా అదే 9% రాబడితో పెట్టుబడిగా పెడితే, అది 20 ఏళ్ల తర్వాత రూ.1.26 కోట్లకు పైగా మారుతుంది. అంటే, అద్దెకు ఉంటూ పెట్టుబడులు పెట్టిన వ్యక్తి వద్ద మొత్తం రూ.2.83 కోట్లకు పైగా సంపద ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

లెక్కలు ఒకలా చెబుతున్నా, భావోద్వేగాలు మరోలా పనిచేస్తాయి. ఇది నా ఇల్లు అనే భావన చాలా మందికి మానసిక ప్రశాంతత ఇస్తుంది. ఇంటి యజమానితో ఇబ్బందులు లేకుండా, మనకు నచ్చినట్టు జీవించాలనే కోరిక కూడా ఉంటుంది. అందుకే కొందరు ఆర్థికంగా అద్దె మంచిదని తెలిసినా, సొంతింటికే ప్రాధాన్యం ఇస్తారు. మరికొందరు మాత్రం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం అద్దె జీవనశైలిని ఎంచుకుంటున్నారు.

చివరికి ఏది మంచిది..?

దీనికి ఒకే సమాధానం ఉండదు. స్థిరత్వం, భావోద్వేగ భద్రత ముఖ్యమైతే సొంతిల్లు. ఆర్థిక స్వేచ్ఛ, పెట్టుబడి వృద్ధి ముఖ్యమైతే.. అద్దె + పెట్టుబడులు. మీ ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం, కుటుంబ అవసరాలు, భవిష్యత్ లక్ష్యాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

గమనిక: అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. పెట్టుబడి నిర్ణయాల ముందు ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us