CIBIL: మీ క్రెడిట్ స్కోర్ బాగున్నా లోన్ రావడం లేదా? అయితే కారణం ఇదే కావొచ్చు!
మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ రుణం తిరస్కరణకు గురైందా? కేవలం స్కోర్‌తోనే కాదు, బ్యాంకులు మీ ఆదాయ స్థిరత్వం, రుణ భారం, క్రెడిట్ నివేదికలో లోపాలు, తరచుగా రుణ దరఖాస్తులు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ కీలక అంశాలను అర్థం చేసుకుంటేనే రుణ మంజూరు సులభతరం అవుతుంది.

మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే రుణం సులభంగా వస్తుందని చాలామంది భావిస్తారు. అయితే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కేవలం క్రెడిట్ స్కోర్‌ను మాత్రమే కాకుండా, రుణగ్రహీత ఆర్థిక స్థితి, ఆదాయం, అప్పుల భారం వంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే రుణాన్ని మంజూరు చేస్తాయి. అందువల్ల మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ కొంతమందికి రుణాలు తిరస్కరణకు గురవుతున్నాయి. రుణదాతలు ప్రధానంగా పరిశీలించే అంశాల్లో ఆదాయం ఒకటి. స్థిరమైన ఆదాయం లేకపోతే, లేదా తరచూ ఉద్యోగాలు మారుస్తుంటే, బ్యాంకులు రుణం ఇవ్వడానికి వెనుకంజ వేస్తాయి. స్వయం ఉపాధి పొందుతున్నవారి విషయంలో కూడా వ్యాపార ఆదాయం స్థిరంగా ఉందని నిరూపించే పత్రాలను చాలా సంస్థలు కోరుతున్నాయి.
అలాగే ఇప్పటికే ఉన్న అప్పులు కూడా రుణ ఆమోదంపై ప్రభావం చూపుతాయి. అధిక క్రెడిట్ స్కోర్ ఉన్నప్పటికీ, క్రెడిట్ కార్డు బకాయిలు లేదా ఇతర రుణాల EMIలు ఎక్కువగా ఉంటే బ్యాంకులు అప్రమత్తమవుతాయి. ముఖ్యంగా రుణ-ఆదాయ నిష్పత్తి (Debt-to-Income Ratio) అధికంగా ఉంటే, కొత్త రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతాయి. క్రెడిట్ రిపోర్ట్‌లో పొరపాట్లు కూడా సమస్యలకు దారితీస్తాయి. కొన్నిసార్లు తప్పు సమాచారం, పునరావృత ఎంట్రీలు లేదా పాత బకాయిల వివరాలు రిపోర్టులో కనిపించవచ్చు. ఇవి మంచి స్కోర్ ఉన్నప్పటికీ దరఖాస్తు తిరస్కరణకు కారణమవుతాయి. అందుకే రుణం కోసం దరఖాస్తు చేసే ముందు క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తరచూ రుణాల కోసం దరఖాస్తు చేయడం కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రతి దరఖాస్తు సమయంలో జరిగే హార్డ్ ఇన్‌క్వైరీ క్రెడిట్ రిపోర్టులో నమోదవుతుంది. ఎక్కువ విచారణలు ఆర్థిక ఒత్తిడికి సంకేతంగా బ్యాంకులు పరిగణించే అవకాశం ఉంది. అసంపూర్ణ పత్రాలు సమర్పించడం కూడా రుణ తిరస్కరణకు మరో ప్రధాన కారణం. ఆదాయం, ఉద్యోగం, చిరునామా వంటి వివరాలకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోతే, మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా దరఖాస్తు ఆమోదం పొందకపోవచ్చు. అందువల్ల రుణం కోసం దరఖాస్తు చేసే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
