EPFO: ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. కేంద్రం బిగ్ అప్డేట్.. ఎలా తీసుకోవాలంటే..?
ఏటీఎం ద్వారా పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలో కల్పించేందుకు సిద్దమవుతోంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఏడాదిలో ఇది అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అసలు ఎలా ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు అనే విషయం చూద్దాం.

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎఫ్ నగదును సులువుగా విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తులు చేస్తోండగా.. త్వరలో దీనిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. యూపీఐ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను విత్ డ్రా చేసుకునే సౌకర్యంతో పాటు ఏటీఎం సేవలను కూడా ప్రవేశపెట్టనుంది. ఈపీఎఫ్‌వో 3.0 కార్యక్రమం కింద పీఎఫ్ విత్ డ్రాలు, బదిలీ ప్రక్రియలను కాగిత రహితంగా మార్చనుంది.
ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు..
ప్రస్తుతం పీఎఫ్ విత్ డ్రా చేయాలంటే ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్ లేదా ఉమాంగ్ యాప్‌లోకి వెళ్లి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేయాల్సి వస్తోంది. ఇందుకోసం అవసరమైన ఆధారాలు సమర్పించాల్సి వస్తోంది. డాక్యుమెంట్లను సైట్లో అప్‌లోడ్ చేయాల్సి వస్తోంది. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసిన మూడు రోజుల తర్వాత అకౌంట్లో జమ అవుతున్నాయి. దీని వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఖాతాదారులకు నగదు అవసరమైనప్పుడు తీవ్ర జాప్యం జరుగుతోంది. కానీ త్వరలో కేంద్రం కల్పించనున్న సౌకర్యం వల్ల ఏటీఎం నుంచి ఎప్పుడైనా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్‌వో డెబిట్ కార్డు తరహాలో ప్రత్యేక కార్డును జారీ చేయనుందని తెలుస్తోంది. ఈ కార్డు ద్వారా ఖాతాదారులు ఏదైనా బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఈపీఎఫ్‌వో ప్రత్యేక ఏటీఎంలను తీసుకురానుందనే వార్తలు కూడా వినిపించాయి.
మే నెలలో టెస్టులు పూర్తి
ఈపీఎఫ్‌వో ఏటీఎం సేవలకు సంబంధించి మే నెలలో పరీక్షలు పూర్తయ్యాయి. ఇటీవల ఈ విషయాన్ని కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇంకా నిర్టిష్ట తేదీని మాత్రం ప్రకటించలేదు. ఏటీఎంల ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌లోని 75 శాతం నగదును తీసుకోవచ్చు. మిగిలిన నగదును ఉద్యోగం మా నేసిన తర్వాత తీసుకోవచ్చు. కనీసం 25 శాతం బ్యాలెన్స్ కలిగి ఉండాలని ఈపీఎఫ్‌ఓ నిబంధన విధించింది. దీంతో ఒకేసారి నగదు మొత్తం విత్ డ్రా చేయడం కుదరదు. ఇక యూపీఐ ద్వారా కూడా 75 శాతం వరకు తీసుకోవచ్చు. అలాగే ఆటో సెటిల్మెంట్ పరిమితిని కేంద్రం పెంచింది. గతంలో రూ.లక్ష ఉండగా.. ఇప్పుడు దానిని రూ.5 లక్షలకు పెంచింది. ఇల్లు కొనుగోలు, ఇంటి నిర్మాణం, విద్య, వివాహం లేదా వైద్య చికిత్స వంటి అవసరాల కోసం చేసే క్లెయిమ్స్‌కు ఇది వర్తిస్తంుది.
