బిట్ కాయిన్ ఆల్ టైం రికార్డ్, వాల్‌స్ట్రీట్‌లో క్రిప్టో క‌రెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ త‌న షేర్లను ఆవిష్కరిస్తున్న వేళ అద్భుతం

Bitcoin price : క్రిప్టో క‌రెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ తాజాగా స‌రికొత్త రికార్డు న‌మోదు చేసింది.

  • Venkata Narayana
  • Publish Date - 10:16 am, Wed, 14 April 21
బిట్ కాయిన్ ఆల్ టైం రికార్డ్,  వాల్‌స్ట్రీట్‌లో క్రిప్టో క‌రెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ త‌న షేర్లను ఆవిష్కరిస్తున్న వేళ అద్భుతం

Bitcoin price : క్రిప్టో క‌రెన్సీ దిగ్గజం బిట్ కాయిన్ తాజాగా స‌రికొత్త రికార్డు న‌మోదు చేసింది. క్రిప్టో క‌రెన్సీ ఎక్స్చేంజ్ ట్రేడింగ్‌లో 62 వేల డాల‌ర్ల మార్క్‌ను దాటి 62,377 డాల‌ర్ల రికార్డు ధ‌ర ప‌లికింది. కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న కొద్దీ బిట్ కాయిన్ విపరీతంగా బలపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభం నుంచి మరో అడుగు ముందుకేసి బిట్ కాయిన్ 114 శాతంపైగా గ్రోత్ చూపించింది. వాల్‌స్ట్రీట్‌లో క్రిప్టో క‌రెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ త‌న షేర్లను ఆవిష్కరిస్తున్న సమయాన బిట్ కాయిన్ తాజాగా ఆల్ టైం రికార్డు నెల‌కొల్పడం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. క్రిప్టో క‌రెన్సీ మార్కెట్ పై ముఖ్యంగా భారతదేశంలో అనేక అనుమానాలు నెలకొన్న తరుణంలో నాస్‌డాక్‌లో క్రిప్టో క‌రెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ ఆవిష్కర‌ణ‌కు స‌ర్వస‌న్నద్ధం కావ‌డం మరో విశేషం. కాగా, కాయిన్ బేస్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ విలువ ఏకంగా 70 నుంచి 100 బిలియ‌న్ల డాల‌ర్లు ఉంటుంద‌ని అంచ‌నా. ఇక, 2018 లో కుదేలైపోయిన బిట్ కాయిన్‌.. గ‌తేడాది క‌రోనా మ‌హ‌మ్మారి విశ్వరూపం ప్రద‌ర్శిస్తున్న కొద్దీ క్రిప్టో క‌రెన్సీ ఎక్స్చేంజీలో రికార్డుల మోత మోగిస్తూ ముందుకెళ్తోంది.

గ‌తేడాది అక్టోబ‌ర్లో 12 వేల డాల‌ర్లుగా న‌మోదైన బిట్ కాయిన్ విలువ గ‌త నెల‌లో 60 వేల డాల‌ర్ల మార్కు దాటడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుత రేటు ప్రకారం మ‌న‌ కరెన్సీలో బిట్ కాయిన్ ధర దాదాపు 50 లక్షలకు చేరిపోయింది. ఒక వైపు కరోనా విజృంభణ, మరోవైపు టెస్లా కంపెనీ అధినేత ఎల‌న్‌మ‌స్క్ పెట్టుబ‌డులు పెట్టడంతోపాటు ప‌లు ఇంటర్నేష‌న‌ల్ ఫైనాన్స్ స‌ర్వీసెస్ సంస్థలు సైతం త‌మ వినియోగదారుల్ని బిట్ కాయిన్‌తో లావాదేవీల‌కు అనుమ‌తించ‌డం కూడా బిట్ కాయిన్ విలువ భారీగా పెరిగిపోవడానికి తక్షణ కారణాలుగా కనిపిస్తున్నాయి.