Billionaires Lose: ప్రపంచ కుబేరుల సంపద కరిగిపోయింది. ఆరు నెలల్లో బిలియనీర్ల వందల కోట్లు తరిగిపోయాయి. ఇప్పుడు వంద బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉన్నది కేవలం నలుగురికే. ఎలన్ మస్క్ సంపద 62 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. జెఫ్ బెజోస్ వెల్త్ 63 బిలియన్ డాలర్లు ఆవిరైపోయింది. మార్క్ జుకెర్‌బర్గ్ ఆస్తి సగానికి పైగా తరిగిపోయింది. ఇది జరిగింది ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు అంటే ఆరు నెలల్లోనే. మొత్తంగా చూస్తే.. ప్రపంచంలో 500 మంది అత్యంత ధనవంతుల సంపద 1.4 ట్రిలియన్ డాలర్ల మేర తగ్గిపోయింది. గ్లోబల్ బిలియనీర్లు తమ ఆస్తుల్లో ఇలాంటి భారీ క్షీణతను ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో రెండళ్ల పాటు భారీగా సంపదను పోగేసుకున్న ప్రపంచ బిలియనీర్లు ఇప్పుడు భిన్నమైన పరిస్థితుల్ని ఫేస్ చేస్తున్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు ప్రపంచ దేశాలు భారీ ఉద్దీపన పథకాలను ప్రకటించాయి.
దీంతో టెక్ సంస్థలు భారీగా లాభపడి, ఆ సంస్థల అధిపతుల సంపద ఒక్కసారిగా పెరిగింది. కోవిడ్ సంక్షోభం సమసిపోతుండటంతో ఆయా దేశాలు ఉద్దీపన పథకాలను ఉపసంహరిస్తున్నాయి. ద్రవ్యోల్బణానికి కళ్లెం వేసేందుకు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లపై తీవ్ర ఒత్తిడితో ఆయా కంపెనీల షేర్లు పతనమై బిలియనీర్ల సంపద కరిగిపోతోంది. అయితే సంపద ఎంత కరిగిపోయినా ఇప్పటికీ ఎలాన్ మస్కే ప్రపంచంలో అపర కుబేరుడు. ఆయన సంపద 210 బిలియన్ డాలర్లు. 133 బిలియన్ డాలర్ల సంపదతో జెఫ్ బెజోస్ రెండో స్థానంలో ఉన్నారు. 128 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ అర్నాల్ట్ మూడో స్థానంలో, 115 బిలియన్ డాలర్లతో బిల్ గేట్స్ నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉన్నవారు ఈ నలుగురే. ఈ ఏడాది మొదట్లో ఈ జాబితాలో 10 మంది ఉండేవారు. ఆరు నెలల్లో సంపద కరిగిపోవడంతో ఆరుగురి చోటు పోయింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి