షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతూ వేల కోట్లు ఆర్జిస్తున్న బిగ్ బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఇకపై నేరుగా ప్రత్యక్ష వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా షేర్ మార్కెట్‌పై తనదైన ముద్ర వేసిన ఆయన విమానయాన రంగంలో ఇక తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. విమాన ప్రయాణాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేలా ఓ చౌక విమానయాన సంస్థను నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు.
మరో 15 రోజుల్లో విమానయాన శాఖ నుంచి తనకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా. రానున్న నాలుగేళ్లలో 70 విమానాలను సమకూర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామన్నారు. 180 మంది ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న విమానాలను ఎంపిక చేసుకోనున్నట్లు తెలిపారు.
ఇందుకోసం తన తరఫున ప్రస్తుతానికి 35 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపారు. భారత కరెన్సీలో దీని విలువ రూ.260.25 కోట్లు. సంస్థలో తనకు 40 శాతం వాటాలుండే అవకాశం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో విస్తృత అనుభవం ఉన్న ప్రముఖులు తన భాగస్వాములుగా ఉంటారని తెలిపారు.
అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ డెల్టా ఎయిర్‌లైన్స్, దేశీయ కంపెనీ ఇండిగోలో పనిచేసిన మాజీ ఉన్నతాధికారులు తనతో కలిసి వస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో భారత్‌లో విమనయాన రంగానికి భారీ డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు. ఆకాశ ఎయిర్‌లైన్స్‌గా పిలవబోయే తమ కంపెనీ.. ప్రయాణికులకు అత్యంత చౌకగా విమాన సేవలు అందించనుందని తెలిపారు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా.