Bank Locker: ఎక్కువ మంది బ్యాంక్ లాకర్ ప్రారంభించేందుకు సమీపంలో ఉన్న బ్యాంకులకు వెళ్తారు. అయితే ఆ బ్యాంకు శాఖలో కొన్ని లాకర్ అందుబాటులో ఉంటే మీకు సమయానికి లభించే అవకాశం ఉంటుంది. లేకపోతే లేదు. అప్పుడు మీరు బ్యాంకుకు వెళ్లినా మీ పని జరగదు. సమయం వృథా అవుతుంది. ఆ బ్యాంకును వదిలేసి దూరంగా ఉన్న మరొక బ్యాంకుకు సంప్రదించడానికి బదులుగా, బ్యాంకు లాకర్ కోసం రిజిస్టర్ చేసుకుంటే అందుబాటులో ఉన్నప్పుడు మీరు లాకర్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం.. బ్యాంకులు లాకర్ల కోసం వెయిటింగ్ లిస్ట్‌ను నిర్వహించాలి. లాకర్ కోసం సంప్రదించిన వారికి వెయిట్ లిస్ట్ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని తెలిపింది. బ్యాంకు లాకర్లు ఫస్ట్-కమ్-ఫస్ట్-సర్వ్ బేసిస్ లో లభిస్తాయి. ఎవరైనా లాకర్ నుంచి వెళ్లిపోయినట్లయితే ఆ అవకాశం మీకు లభిస్తుంది. బ్యాంకు లాకర్ ఉపయోగించుకునేందుకు తప్పనిసరిగా ఆ బ్యాంకులో ఖాతా ఉండాల్సిన అవసరం లేదన్న విషయం గుర్తుంచుకోండి.
మీరు వస్తువులను బ్యాంకు లాకర్‌లో పెట్టినందుకు గానూ బ్యాంకుకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సార్లు బ్యాంకులు లాకర్ సదుపాయం ఇచ్చేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రారంభించమని కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంకులు తమ వినియోగదారులను మూడు సంవత్సరాల అద్దెకు సమానమైన ఎఫ్‌డీ ఖాతా ప్రారంభించమని అడిగేందుకు అనుమతి ఉంది.
మీరు లాకర్‌ను తెరిచిన తర్వాత రెగ్యులర్‌గా ఆపరేట్ చేస్తుండాలి. లేకపోతే దానిని రద్దు చేసే అవకాశం ఉంటుంది. అయితే రద్దు చేసే ముందు బ్యాంకు మీకు నోటీసు పంపుతుంది. మధ్యస్థంగా రిస్క్ ప్రొఫైల్ ఉన్న కస్టమర్లు కనీసం మూడేళ్లకోసారి లాకర్‌ను ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అయితే అధిక-రిస్క్ ఉన్న కస్టమర్లు కనీసం సంవత్సరానికి ఒకసారి ఆపరేట్ చేయాలి. ఆర్థిక లేదా సామాజిక స్థితి, వ్యాపార కార్యకలాపాల స్వభావం, వినియోగదారుల స్టేటస్ వంటివి ప్రామాణికంగా చేసుకొని బ్యాంకులు తమ వినియోగదారులను తక్కువ నుంచి అధిక రిస్క్ ప్రొఫైల్స్‌గా గుర్తిస్తారు. ఈ విధంగా బ్యాంకులో లాకర్ సదుపాయం కావాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకుంటే బెటర్. మీకు లాకర్ సదుపాయం లేకపోతే రిజిస్టర్ చేసుకున్న తర్వాత సదుపాయం ఉన్నప్పుడు మీకు అవకాశం ఇస్తారు. అందుకే నేరుగా లాకర్ సదుపాయం కోసం వెళ్లకుండా ముందుగానే లాకర్ కోసం రిజిస్టర్ చేసుకుంటే మంచిది.