కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత భాగం దాచుకోవడం అందరూ చేస్తారు. అయితే, డబ్బును దాచుకోవడానికి ఎక్కువమంది నమ్మేది బ్యాంకులు.. పోస్టాఫీసులు. మిగిలిన విధానాలతో పోలిస్తే తక్కువ రాబడి వచ్చినా.. తమ డబ్బుకు ఏమీ కాదనే భరోసా బ్యాంకుల్లోనూ.. పోస్టాఫీసుల్లోనే దొరుకుతుందని మెజార్టీ ప్రజలు నమ్ముతారు. ఇటీవల కాలంలో చాలా సేవింగ్స్ పథకాలు పోస్టాఫీస్ లో ప్రాచుర్యంలో ఉన్నాయి. బ్యాంకులు కూడా ఫిక్స్ డ్ డిపాజిట్ పథకంలో ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి. మరి బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ (FD) మంచిదా? పోస్టాఫీస్ లో అందుబాటులో ఉన్న అలాంటి పథకం కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ బెటరా అనేది చాలామందికి గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు విధానాల్లో ఏది బెటర్ అనేదానిని తెలుసుకుందాం.
బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI), HDFC, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లతో సహా అనేక ఇతర బ్యాంకులు ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ రేట్లను పెంచాయి. ఇప్పుడు మీరు ఈ బ్యాంకుల్లో లేదా మరేదైనా బ్యాంకులో FD పొందాలని ప్లాన్ చేస్తుంటే, దానికి ముందు మీరు పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్ర (KVP) స్కీమ్ వడ్డీ రేట్ల గురించి కూడా తెలుసుకోవాలి. ఈ పథకంలో 7.5% వడ్డీ లభిస్తోంది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటే.. బ్యాంక్ FDతో పోలిస్తే ఇది లాభదాయకమా? కాదా అనే విషయం అర్ధం అవుతుంది.
పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్ర (KVP) స్కీమ్ లో ఒక బాండ్ ఇస్తారు. ఇది పోస్టాఫీస్ ముద్రతో వస్తుంది. దీనిలో ఒకే వడ్డీ రేటు ఉంటుంది. మీరు ఈ స్కీమ్ లో బాండ్ తీసుకున్నపుడు ఉన్న వడ్డీరేటు మెచ్యూరిటీ వరకూ కొనసాగుతుంది దీనిలో కనిష్టంగా రూ.1000 పెట్టుబడి పెట్టవచ్చు. దీనిలో గరిష్ఠ పెట్టుబడి పరిమితి లేదు. రూ.100ల గుణిజాలలో ఎంత డబ్బైనా ఇక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని పోస్టాఫీసుల్లో ఈ కిసాన్ వికాస్ పాత్ర స్కీమ్ లో జాయిన్ కావచ్చు. ఈ ఎకౌంట్ ను ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. అలానే ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు కూడా బదిలీ చేసుకోవచ్చు.
వికాస్ పత్రలో పెట్టుబడి పెట్టే వ్యక్తి వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. సింగిల్ అకౌంట్ కాకుండా జాయింట్ అకౌంట్ సౌకర్యం కూడా ఉంది. మైనర్‌లు కూడా ఈ పథకంలో పాల్గొనవచ్చు, అయితే వారిని వారి తల్లిదండ్రులు పర్యవేక్షించవలసి ఉంటుంది. మీరు మీ పెట్టుబడిని ఉపసంహరించుకోవాలనుకుంటే కనీసం రెండున్నరేళ్లు (30 నెలలు) వేచి ఉండాల్సి ఉంటుంది. అంటే రెండున్నరేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. రెండున్నరేళ్లు నిండే వరకు ఈ పథకం నుంచి డబ్బు వెనక్కి తీసుకోలేరు.ఈ స్కిం లో ప్రస్తుతం 7.5% వడ్డీ లభిస్తోంది. మరోవైపు అన్ని బ్యాంకులు FD ల కోసం అవకాశం ఇస్తాయి. ప్రస్తుతం వివిధ బ్యాంకుల్లో FD రేట్లు ఇలా ఉన్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా 7.25 %, యాక్సిస్ బ్యాంక్ 7.10%, HDFC 7.15 %, ఇండస్ ఇండ్ బ్యాంక్ 7.25 %, బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.75% వడ్డీ ఇస్తున్నాయి. అయితే, ఈ వడ్డీ రేట్లు మీరు ఎంతకాలానికి ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తారన్న దాన్ని బట్టి మారతాయి. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లను పరిశీలిస్తే పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర (KVP) నుంచి వచ్చే వడ్డీ రేటు ఎక్కువగా ఉంది. కాకపోతే, దీనిలో రెండున్నరేళ్లు లాకింగ్ పిరియడ్ ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్లను నిర్ణీత కాలవ్యవధిలోపే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
మరిన్ని పర్సనల్ ఫినాన్స్ కథనాలు చదవండి..