Electric Vehicles: పలు ద్విచక్ర వాహనాల కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. దీంతో మార్కెట్లో పోటీ పెరుగుతోంది. రోజుకో కంపెనీ సరికొత్త మోడల్‌ని ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈవీ సెగ్మెంట్‌లో హీరో, ఈథర్, ఒకినావాలు సందండి చేస్తుండగా తాజాగా ఈ జాబితాలో బజాజ్ కూడా చేరనుంది. ఫ్రీ రైడర్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ట్రేడ్‌మార్క్ రిజిస్టర్ చేయించింది.
ఇండియా టూ వీలర్ మార్కెట్లో బజాజ్‌ది ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుందనే చెప్పాలి. ఒకప్పుడు దేశం మొత్తాన్ని చేతక్ స్కూటర్ ఒక రేంజ్‌లో ఊపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యూత్‌లో మంచి క్రేజ్‌ని పల్సర్ లాంటి బైక్‌లను మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే యూత్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న బైక్‌గా పల్సర్‌కు మంచి పేరుంది.
తాజాగా ఈవీ సెగ్మెంట్‌పైనా బజాజ్ కంపెనీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో ఉండగా మరో కొత్త మోడల్‌ను తీసుకు వస్తుంది. ఫ్రీ రైడర్ పేరుతో కొత్త స్కూటర్‌ని తేనుంది. దీనికి సంబంధించిన ట్రేడ్ మార్క్ కోసం మార్చి 1న అప్లయ్ చేస్తే.. జూన్ 1న ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇలా రోజురోజుకు పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. కస్టమర్లు కూడా పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా ఈ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.