Ather energy: ఐపీఓ బాటలో మరో ఈవీ కంపెనీ.. స్టాక్ మార్కెట్‌లో ఇక సందడే..!
నూతన ఆర్థిక సంవత్సరంలో తొలి ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ ఐపీవోకు రానుంది. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారికి ఐపీవో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారందరూ వీటి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఒక కంపెనీ తన వాటాలను ప్రజలకు విక్రయించడాన్నే ఐపీవో అంటారు. ఉత్పత్తిని పెంచడం, కొత్త ప్లాంట్లు నిర్మించడం, విస్తరణ తదితర వాటికి నిధులను సమకూర్చుకోవడానికి కంపెనీలు ఐపీవోకు వస్తాయి. ఈ నేపథ్యంలో ఐపీవోకు రానున్న ఏథర్ ఎనర్జీ కంపెనీ గురించి తెలుసుకుందాం.

ఈ ఏడాది ఫిబ్రవరి 18న క్వాలిటీ పవర్ ఎక్విప్ మెంట్స్ రూ.859 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. ఈ తర్వాత ఇప్పుడే ఏథర్ ఎనర్జీ రానుంది. రెండింటి మధ్య సుమారు రెండు నెలలుగా ఎటువంటి కంపెనీలు రాలేదు. కాగా.. ఏథర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకి రూ.304-321 మధ్య ధరలను ప్రకటించింది. ఇష్యూ ఈనెల 28 నుంచి 30 వరకూ కొనసాగుతుంది. దీనిలో భాగంగా రూ.2,626 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనున్నారు. వీటితో పాటు మరో 1.1 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు. వీటి ద్వారా సుమారు రూ.2,981 కోట్లను కంపెనీ సమీకరించనుంది.
బెంగళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లు, బ్యాటరీ ప్యాక్ లు, చార్జింగ్ మౌలిక సదుపాయాలు, సహాయక సాఫ్ట్ వేర్ రంగాల్లో పెట్టుబడులు పెడుతుంది.. ఉత్పత్తి, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తూ.. పూర్తి ఇంటిగ్రేడెట్ ఈవీ తయారీదారుగా పనిచేస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 109,577 ఎలక్ట్రిక్ టూ వీలర్లను విక్రయించింది. దేశంలో 265 అనుభవ కేంద్రాలు, 233 సేవా కేంద్రాలను కలిగి ఉంది. అలాగే నేపాల్ లో ఐదు అనుభవ, నాలుగు సేవా కేంద్రాలు, శ్రీలంకలో పది అనుభవ, ఒక సేవా కేంద్రం నిర్వహిస్తోంది.
ముఖ్యమైన అంశాలు
- ఏథర్ ఎనర్జీ ఐపీవో ఏప్రిల్ 28వ తేదీన సబ్ స్క్రిప్షన్ల కోసం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 30న ముగుస్తుంది.
- రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతి ఈక్విటీ షేరుకు రూ.304 నుంచి రూ.321 ధర నిర్ణయించారు.
- యాంకర్ ఇన్వెస్టర్ల కు ఏప్రిల్ 25న కేటాయింపు జరుగుతుంది.
- రాబోయే ఐపీవోలో రూ.2,626 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లు జారీ చేస్తారు. ప్రమోటర్లు, ఇతర వాాటాదారుల ద్వారా రూ.1.1 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఉంటుంది.
- మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం, రుణ చెల్లింపుల కోసం రూ.40 కోట్ల కేటాయించడం, పరిశోధనకు రూ.750 కోట్లు, మార్కెటింగ్ పై రూ.300 కోట్ల ఖర్చుచేయాలని కంపెనీ భావిస్తోంది. ఇలా ఐపీవో నుంచి వచ్చిన ఆదాయంలో రూ.927.2 కోట్లను కేటాయించనున్నారు. 2026 నుంచి 2028 ఆర్థిక సంవత్సరాల్లో వీటి కేటాయింపు జరుగుతుంది.




