ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని ప్రభావంతో వివిధ దేశాలు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో మాంద్యం ప్రభావం మరింత ఎక్కువుగా ఉండవచ్చనే అంచనాల నేపథ్యంలో ఇప్పటికే పలు టెక్ కంపెనీలు తమ వ్యయాలను తగ్గించుకోవడానికి ఉద్యోగుల సంఖ్యలో కోత విధిస్తున్నాయి. మాంద్యం ప్రభావంతో ఎంతో మంది తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావం అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా కనిపిస్తోంది. వివిధ దేశాల ఆర్థిక పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నప్పటికి.. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతోంది. ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా దేశ ఆర్థిక రంగం ఎంతో ఆరోగ్యకరంగా ఉందని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఆసియా అభివృద్ధి బ్యాంకు మాత్రం భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను సవరించలేదు. మరోవైపు, ఆసియాలో ఆర్థిక మందగమనం గత అంచనాల కంటే దారుణంగా ఉండవచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంకు అంగీకరించింది. యూరోపియన్ దేశాలలో కూడా మాంద్యం ఒత్తిడి అధికంగా ఉండవచ్చని మరికొన్ని సంస్థలు అంచనా వేశాయి.
2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధిని ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడు శాతంగా అంచనా వేసింది. ఈఏడాది సెప్టెంబర్‌లో కూడా ఇదే వృద్ధి రేటును అంచనా వేసింది. ఈ నివేదిక ప్రకారం సెప్టెంబరు నుంచి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు భారత్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేదని స్పష్టమవుతోంది. 2021-22లో దేశ జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి 8.7 శాతం కాగా, 2023-2024 ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధి 7.2 శాతం ఉండవచ్చని అంచనా వేసింది. మొత్తంగా ఆసియాలో ఆర్థిక వృద్ధి మందకొడిగా ఉండవచ్చని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఆసియా వృద్ధి 4.2 శాతం, 2023లో 4.6 శాతం ఉండవచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంకు తన నివేదికలో పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశ ఆర్థిక మూలాలు ప్రాథమికంగా బలంగా ఉండటంతో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 7 శాతం చొప్పున కొనసాగుతోందని నివేదిక పేర్కొంది. 2023-24 సంవత్సరానికి వృద్ధి అంచనాను 7.2 శాతం వద్ద నిలుపుకోవడం ప్రభుత్వ పెట్టుబడి ఉత్ప్రేరకమైన నిర్మాణాత్మక సంస్కరణలు, ప్రైవేట్ పెట్టుబడుల యొక్క సానుకూల ప్రభావం కారణంగానే ఉందని పేర్కొంది. రెండవ త్రైమాసికంలో (జూలై నుండి సెప్టెంబర్ వరకు) భారత ఆర్థిక వ్యవస్థ 6.3 శాతం వృద్ధిని సాధించిందని, ఇది ప్రజల వినియోగంలో 4.4 శాతం మందగమనాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ ఎగుమతులు 11.5 శాతం చొప్పున పెరిగాయని ఆసియా అభివృద్ధి బ్యాంకు తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..