Apple India: చైనాను తలదన్ని ఐఫోన్ హబ్‌గా మారిన భారత్…

భారత్‌లో ఐఫోన్ల తయారీని యాపిల్ సంస్థ అంతకంతకూ పెంచుతోంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ప్రతీ ఐదు ఐఫోన్లలో.. ఒకటి భారత్‌లోనే తయారవుతోంది. 2023-24తో పోల్చుకుంటే 2024-25లో.. భారత్‌లో ఐఫోన్ల తయారీ ఏకంగా 60 శాతం పెరగడం గమనార్హం. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Apple India:  చైనాను తలదన్ని ఐఫోన్ హబ్‌గా మారిన భారత్...
Apple Phones

Updated on: Apr 14, 2025 | 3:42 PM

భారతదేశంలో తయారీ రంగంలో ఆపిల్ ఒక పెద్ద మైలురాయిని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో, ఆపిల్ కంపెనీ ఇక్కడ దాదాపు 1.8 కోట్ల రూపాయలు అంటే దాదాపు $22 బిలియన్ల విలువైన ఐఫోన్‌లను తయారు చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 60 శాతం కంటే ఎక్కువ. ఈ పెరుగుదల ఆపిల్ ఇప్పుడు తన ఉత్పత్తిని మన దేశంలో చైనాకు మించి విస్తరిస్తోందని.. భారతదేశాన్ని యాపిల్ ఫోన్ల తయారీ కేంద్రంగా మారుస్తోందని స్పష్టంగా సూచిస్తుంది.

యాపిల్ కంపెనీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్న ప్రతి 5 ఐఫోన్‌లలో 1 ఐఫోన్‌ను భారతదేశంలో తయారు చేస్తోంది. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, దాని ఉత్పత్తిలో దాదాపు 20 శాతం భారతదేశంలో జరుగుతోంది. అదే సమయంలో, ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కింద భారతదేశంలో తయారీని పెంచాలని కూడా కోరుకుంటోంది. ఫిబ్రవరిలో ‘పరస్పర’ సుంకాల ప్రణాళికలు ప్రకటించిన తర్వాత భారతదేశం నుండి అమెరికాకు ఐఫోన్ షిప్‌మెంట్‌లు పెరిగాయి.

ఇప్పుడు  ఐ ఫోన్ల తయారీకి భారత్ కేంద్ర బిందువు

ఆపిల్ సరఫరాదారులైన ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్‌లు… చైనాకు దూరంగా జరుగుతూ భారతదేశాన్ని తయారీ కేంద్రంగా వేగంగా స్వీకరిస్తున్నాయి. ఇక్కడ ఉత్పత్తి కూడా వేగంగా జరుగుతోంది. కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా చైనాలో ఆపిల్ అతిపెద్ద దెబ్బను ఎదుర్కొన్న తర్వాత వారు భారత్ వైపు చూడటం ప్రారంభించారు.

భారతదేశంలో ఐఫోన్లు ఎక్కడ తయారు చేస్తున్నారు?

భారతదేశంలో తయారయ్యే చాలా ఐఫోన్‌లను దక్షిణ భారతదేశంలోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో అసెంబుల్ చేస్తారు.  భారతదేశంలో ఆపిల్ ఉత్పత్తి నెట్‌వర్క్‌ల పరిధి కూడా నిరంతరం విస్తరిస్తోంది.

పెరుగుతున్న  ఎగుమతులు..

ప్రభుత్వ డేటా ప్రకారం,  2024–25 ఆర్థిక సంవత్సరంలో 17.4 బిలియన్‌ డాలర్ల విలువైన ఫోన్లను యాపిల్ ఎగుమతి చేసింది. చైనా,  భారత్‌లో సహా చాలా దేశాలపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్‌‌‌‌ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌‌‌‌లను వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యాపిల్ తన ఎగుమతులను ఇండియా నుంచి పెంచింది.  కంపెనీ గత నాలుగు నెలల్లో 600 టన్నుల ఐఫోన్లను చెన్నై విమానాశ్రయం నుంచి  అమెరికాకు ఎగుమతి చేసిందని అంచనా.  యాపిల్ కూడా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకుటోంది. ఇప్పటికే  కొంత తయారీ సామర్ధ్యాన్ని చైనా నుంచి ఇండియాకు  మార్చింది.  దీనికి తోడు ప్రభుత్వం కూడా పీఎల్‌‌‌‌ఐ కింద  2.7 బిలియన్ డాలర్ల (రూ.23 వేల కోట్ల) విలువైన రాయితీలను ఇస్తుండడంతో ఇక్కడ తయారీని పెంచుతోంది.