
ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ గ్లోబల్ వైడ్ గా వేగంగా విస్తరిస్తోంది. ఆటో మొబైల్ రూపు రేఖలను మార్చేస్తోంది. ముఖ్యంగా చైనా, యూఎస్ఏ వంటి దేశాల్లో జెట్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణి దూసుకెళ్తోంది. ఈ క్రమంలో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలతో పాటు పలు స్టార్టప్ లు, వేరే రంగాల్లో టాప్ బ్రాండ్లుగా పేరొందిన సంస్థలు ఎలక్ట్రిక్ కార్లు, బైక్లు, స్కూటర్ల ఉత్పత్తికి ముందడగు వేశాయి. అలాంటి వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి రెండు ఉన్నాయి. అవి ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీలు అయిన జియోమీ, యాపిల్. ఈ రెండు కంపెనీలు సెల్ఫ్ డ్రైవ్ కార్లను ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించాయి. అందులో భాగంగానే ఇటీవల జియోమీ తన కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ ను లాంచ్ చేసింది. కాగా యాపిల్ మాత్రం అందుకు విరుద్ధంగా వెళ్తోంది. తన ఎలక్ట్రిక్ కార్ల ప్రాజెక్టును పూర్తిగా అటకెక్కించేసింది. ఎందుకలా? అసలు కారణం ఏంటి? ఉన్నట్టుండి ఎందుకు ఈ ప్రయత్నాన్ని విరమించుకుంది. తెలుసుకుందాం రండి..
కొంత కాలం క్రితం అట్టహాసంగా ప్రకటించిన యాపిల్ ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్టుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఉత్పత్తి ప్రారంభం కాక ముందే ప్రాజెక్టుకు స్టాప్ బోర్డు పడింది. సెల్ఫ్ డ్రైవింగ్ సామర్థ్యంతో తీసుకొస్తున్న యాపిల్ టైటాన్ కారు ఇక రోడ్డెక్కే పరిస్థితి లేదు. దాదాపు దశాబ్ద కాలంగా దానిపై పనిచేస్తున్న యాపిల్ .. ఏకంగా ప్రాజెక్టు మొత్తాన్నే నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంస్థ అంతర్గత సమావేశంలో ఉద్యోగులకు కంపెనీ సమాచారం ఇచ్చినట్లు సమాచారం. అయితే యాపిల్ అధికారికంగా దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటనా చేయలేదు.
యాపిల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు టైటాన్ కోసం పనిచేస్తున్న సిబ్బందిని సైతం ఏఐ వింగ్ కు బదిలీ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి 2014లోనే యాపిల్ ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్టును ప్రారంభించింది. 2020లో ఓ కీలక ప్రకటన చేసింది. 2024 కల్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారును తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఏకంగా కారు తయారీనే నిలిపివేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై టెక్ వర్గాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. యాపిల్ ఇప్పటి వరకూ ఈ కారు ఎలా ఉంటుందో వెల్లడించలేదు. కానీ సిలికాన్ వ్యాలీ రోడ్ల పై దాని పరీక్షించినట్లు పలుమార్లు నెట్టింట్ వార్తలు హల్ చల్ చేశాయి.
ప్రపంచం అడ్వాన్స్ అవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో కంపెనీలు దూసుకుపోతున్నాయి. అయితే టిమ్ కుక్ నేతృత్వంలోని యాపిల్ సంస్థ మాత్రం అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కాస్త వెనకబడుతోందని టక్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనికి ఇటీవల వస్తున్న ఐఫోన్ మోడళ్లను ఉదాహరణగా పలువురు చూపిస్తున్నారు. వీటిల్లో పెద్దగా మార్పులేమి ఉండటం లేదనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..