cyber security insurance: సైబర్ స్కామ్స్ గురించి భయపడుతున్నారా? అయితే ఒక పని చేయండి.. ఇన్సూరెన్స్ తీసుకోండి!
రోజుకో కొత్త రకమైన స్కామ్ బయటపడుతుంటే భయమేస్తుందా? మనకు ఎప్పుడైనా ఇలా జరిగితే ఎలా అని.. అయితే ముందు జాగ్రత్తగా ఇన్సూరెన్స్ తీసుకోండి. నిజమే.. సైబర్ ఫ్రాడ్స్ పై కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. దీనివల్ల ఎప్పుడైనా పెద్దమొత్తంలో డబ్బు కోల్పోతే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. దీన్నే సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ అంటారు. ఇదెలా ఉంటుందంటే..

రోజురోజుకీ సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎక్కడోచోట ఎవరో ఒకరు ఆర్థికంగా నష్టపోతూనే ఉన్నారు. అయితే తమ ప్రమేయం లేకుండా జరిగే ఈ తరహా మోసాల కోసం కొత్తగా ఇన్సూరెన్స్‌లు పుట్టుకొచ్చాయి. ఆర్థికంగా నష్టపోతే ఆ నష్టం నుంచి కొంత గట్టేక్కేందుకు ఈ ఇన్సూరెన్స్‌లు పనికొస్తాయి. వీటిని ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.
సైబర్ మోసాలపై తీసుకునే ఇన్సూరెన్స్ ‘సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్’ అంటారు. వీటిని 18 ఏళ్లు పైబడినవారు ఎవరైనా తీసుకోవచ్చు. ఇందులో కట్టే ప్రీమియంను బట్టి రూ. లక్ష నుంచి రూ. కోటి వరకూ కవరేజీ పొందొచ్చు.
ఇవన్నీ కవర్ అవుతాయి
ఈ ఇన్సూరెన్స్ సైబర్ మోసాలన్నీంటికీ వర్తిస్తుంది. ఐడెంటిటీ చోరీ, డబ్బు పోగొట్టుకోవడం, ఫిషింగ్, సైబర్ స్టాకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులపై జరిగే మోసాలు, వెబ్‌సైట్ లింక్‌లతో చేసే మోసాలు, అకౌంట్ హ్యాకింగ్. . ఇలా అన్నిరకాల నష్టాలు ఈ పాలసీలో కవర్ అవుతాయి. అయితే మీకు మీరుగా చేసే పనులకు ఈ పాలసీలు వర్తించవు. అంటే అత్యాశకు పోయి పెట్టుబడులు పెట్టడం లేదా బెట్టింగ్ యాప్స్ లో మనీ పోగొట్టుకోవడం లాంటివి చేస్తే బీమా వర్తించదు. మీ ప్రమేయం లేకుండా జరిగే ఫ్రాడ్స్ కే వర్తిస్తుంది. అలాగే పాలసీదారుడిపై ఎలాంటి ఫైనాన్షియల్ క్రైమ్ ఉండకూడదు. ఈ పాలసీలు కేవలం ఆర్ధిక పరమైన బీమాను మాత్రమే అందించగలవు. పాలసీదారుడు కోల్పోయిన డేటా, ఫోటోలు వంటివి పాలసీ కవర్ చేయదు. డబ్బు పరమైన వాటికి కవరేజ్ అందిస్తుంది. అలాగే మినిమన్ సెక్యూరిటీ టిప్స్ పాటించకపోతే కూడా ఈ పాలసీ కవర్ అవ్వదు. వీటితోపాటు పాలసీ ఇష్యూవర్ ని బట్టి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండొచ్చు.
ఆన్‌లైన్ వేధింపులకు కూడా..
కేవంల సైబర్ స్కామ్స్ కు మాత్రమే కాదు, సైబర్ బుల్లియింగ్ కు కూడా ఈ పాలసీ వర్తిస్తుంది. అంటే సోషల్ మీడియాలో వేధింపులకు గురయిన వాళ్లకు కూడా ఈ పాలసీలు ఆర్ధికంగా హెల్ప్ చేస్తాయి. సోషల్ మీడియాలో మీ పర్సనల్ వివరాలు దొంగిలించి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నప్పుడు అది కూడా సైబర్ క్రైమ్ కిందకే వస్తుంది. కాబట్టి దాన్ని కూడా పాలసీలో భాగంగా కవర్ చేసుకోవచ్చు. అంటే బాధితులు న్యాయపోరాటానికి కావల్సిన డబ్బుని కూడా ఈ పాలసీల ద్వారా పొందొచ్చు. ఒకవేళ సైబర్ బుల్లియింగ్ ద్వారా మానసికంగా కుంగిపోతే.. దానికయ్యే వైద్య ఖర్చులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది.
డాక్యుమెంట్స్ చదివాకే..
సైబర్ నేరాల వల్ల జరిగే నష్టాలను తగ్గించడం కోసం ఈ తరహా పాలసీలు పుట్టుకొచ్చాయి. సైబర్ నేరాల ద్వారా ఎలాంటి నష్టం జరిగినా దాన్నుంచి కోలుకునేవిధంగా ఈ పాలసీలు ఉపయోగపడతాయి. వీటిలో పాలసీ రకాన్ని బట్టి అది కవర్ చేసే బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి పాలసీ తీసుకునేముందే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ పూర్తిగా చదివి పాలసీని ఎన్నుకోవడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




