
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడి భగభగలకు తట్టుకోలేక చాలా ఇళ్లల్లో ఏసీలు నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటాయి. అయితే నెలాఖరున వచ్చే విద్యుత్ బిల్లును చూస్తే మాత్రం సామాన్యుడి గుండె గుభేల్ అంటుంది. కొత్తగా వచ్చే, ఖరీదైన ఇన్వర్టర్ ఏసీలు మాత్రమే తక్కువ కరెంట్ వినియోగిస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ మన ఇంట్లో ఉండే ఒక సాధారణ స్టాండింగ్ ఫ్యాన్ ద్వారా కూడా ఏసీ బిల్లును భారీగా తగ్గించుకోవచ్చని మీకు తెలుసా..? ఏసీకి ఫ్యాన్ తోడుగా ఉంటే గది త్వరగా కూల్ అవ్వడమే కాకుండా జేబుకు చిల్లు పడకుండా కాపాడుతుంది.
సాధారణంగా ఏసీ ఆన్ చేసినప్పుడు దాని నుండి వచ్చే చల్లని గాలి బరువుగా ఉండటం వల్ల గది కింది భాగంలోనే పేరుకుపోతుంది. పైభాగంలో వెచ్చని గాలి అలాగే ఉంటుంది. దీనివల్ల ఏసీలోని సెన్సార్లు గది మొత్తం చల్లబడినట్లు తప్పుగా గ్రహించి, కంప్రెసర్‌ను ముందుగానే ఆఫ్ చేస్తాయి. ఈ సమయంలో గదిలో స్టాండింగ్ ఫ్యాన్ ఆన్ చేయడం ద్వారా అది గదిలోని చల్లని, వెచ్చని గాలిని సమానంగా మిక్స్ చేస్తుంది. ఫలితంగా గది అంతటా ఒకే రకమైన కూలింగ్ చాలా వేగంగా ఏర్పడుతుంది.
కేవలం ఫ్యాన్ ఆన్ చేస్తే సరిపోదు, దానిని గదిలో సరైన స్థానంలో ఉంచడం ఎంతో ముఖ్యం.
అవతలి వైపు ఉంచండి: ఫ్యాన్‌ను ఏసీకి సరిగ్గా కింద కాకుండా గదికి అవతలి వైపున అమర్చాలి. ఇది ఏసీ గాలిని గదిలోని ప్రతి మూలకు ప్రసరింపజేయడానికి సహాయపడుతుంది.
నేరుగా ఏసీ వైపు పెట్టొద్దు: ఫ్యాన్ గాలిని నేరుగా ఏసీ ఇన్-టేక్ వైపు పెట్టకూడదు. అలా చేయడం వల్ల ఏసీ గాలి ప్రవాహానికి అంతరాయం ఏర్పడి, సెన్సార్ తప్పుడు ఉష్ణోగ్రతను చూపిస్తుంది.
విండ్ చిల్ ఎఫెక్ట్
పెడెస్టల్ ఫ్యాన్ గాలిని వేగంగా ఉంచడం ద్వారా మన శరీరానికి ఒక రకమైన చల్లదనాన్ని ఇస్తుంది. దీనినే సైన్స్ భాషలో విండ్ చిల్ ఎఫెక్ట్ అంటారు. ఈ ఎఫెక్ట్ వల్ల మీరు ఏసీని 24 డిగ్రీల వద్ద కాకుండా 26 డిగ్రీల వద్ద నడిపినా కూడా గది 24 డిగ్రీల కన్నా ఎక్కువ చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా ఏసీలో ప్రతీ ఒక డిగ్రీ ఉష్ణోగ్రతను పెంచితే దాదాపు 6 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. మీ గది కేవలం ఏసీతో చల్లబడటానికి 3 గంటలు పడితే ఈ ఫ్యాన్ సాయంతో చాలా వేగంగా కూలింగ్ అందుకోవచ్చు. దీనివల్ల ఏసీ కంప్రెసర్‌పై భారం తగ్గి, కరెంట్ బిల్లు గణనీయంగా తగ్గుతుంది. అందుకే ఈసారి ఏసీ ఆన్ చేసినప్పుడు కేవలం రిమోట్ నొక్కడమే కాదు మూలన ఉన్న ఫ్యాన్‌ను కూడా రంగంలోకి దించండి.. స్మార్ట్‌గా కరెంట్ బిల్లును తగ్గించుకోండి.