
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య అలెర్ట్. త్వరలోనే డీఏ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై తాజాగా మోదీ కేబినేట్ నిర్ణయం తీసుకుందని.. మార్చి 15వ తేదీన ప్రకటించే అవకాశం ఉందని మీడియా వర్గాలు చెబుతున్నాయి.
వాస్తవానికి, ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్(డీఏ)ను పెంచుతుంది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి, ప్రభుత్వం ఎప్పటికప్పుడు డియర్‌నెస్ అలవెన్స్‌ను సవరించాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ సంవత్సరం మొదటి నెలలో, జూలైలో.. ఇలా రెండుసార్లు పెరుగుతుంది. ఇక ఈ ఏడాది డియర్‌నెస్ అలవెన్స్ జనవరిలో పెరగాల్సి ఉండగా.. ఆ అంశంపై ఇప్పటివరకు కేంద్రం నుంచి ఏ ప్రకటన వెలువడలేదు.
మరోవైపు మార్చి 1న, ఉద్యోగులకు డీఏ పెంచుతూ మోదీ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం మాత్రం ఇంకా ఆమోదించాల్సి ఉంది. ఈ ప్రకటన మార్చి 15న వెలువడే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే కోట్లాది మంది కేంద్ర ఉద్యోగులు జనవరి నుంచి పెంచిన డీఏ మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.
ఇంతకుముందు కేంద్ర ఉద్యోగుల కరువు భత్యాన్ని ప్రభుత్వం 4 శాతం పెంచింది. ఈసారి కూడా డీఏను 4 శాతం పెంచితే, ఈ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ 38 నుంచి 42 శాతానికి పెరుగుతుంది. దీంతో ప్రస్తుతం ఉన్న మొత్తం రూ.6840 నుంచి రూ.7560కి పెరగనుంది. ఈ నేపథ్యంలో 7560×12 = 90,720 రూపాయలు పెరగుతాయి. అంటే ప్రతి ఉద్యోగి వార్షిక వేతనంలో దాదాపు 90 వేల రూపాయల మేరకు పడనున్నాయి.