ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టంగా భారత్.. కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడి

|

Jan 16, 2025 | 4:09 PM

దేశంలో స్టారప్ట్ కంపెనీ హవా నడుస్తుంది. 2016లో ప్రారంభమైన ఈ స్టారప్ లు క్రమంగా వేగం పుంజుకుని నేడు ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా అవతరించేందుకు దోహదపడ్డాయి. జనవరి 16తో విజయవంతంగా తొమ్మిదేళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది..

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టంగా భారత్.. కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడి
World's 3rd Largest Startup Ecosystem
Follow us on

న్యూఢిల్లీ, జనవరి 16: పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) జనవరి 15 నాటికి దాదాపు 1.59 లక్షలకు పైగా స్టార్టప్‌లను గుర్తించిందని, దీంతో భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా ఏర్పడినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం (జనవరి 15) తెలిపింది. 2016 నుంచి 2024 అక్టోబరు 31 వరకు దేశ యువతకు 16.6 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించినట్లు వెల్లడించింది. ఇవి నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు గణనీయంగా దోహదపడ్డాయని పేర్కొంది. వీటిల్లో ఐటీ సర్వీసెస్‌ ఇండస్ట్రీ 2.04 లక్షల ఉద్యోగాలతో అగ్రగామిగా కొనసాగుతుంది. ఆ తర్వాత 1.47 లక్షల ఉద్యోగాలతో హెల్త్‌కేర్ అండ్ లైఫ్‌సైన్స్‌, దాదాపు 94 వేల ఉద్యోగాలతో ప్రొఫెషనల్ అండ్‌ కమర్షియల్ సర్వీస్‌లు తర్వాత స్థానాల్లో ఉన్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

2016, జనవరి 16న భారత్‌లో ప్రారంభమైన ‘స్టార్టప్ ఇండియా’ నేటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. 2016లో ప్రారంభమైన స్టారప్ట్ ఇండియా దేశంలోనే ఒక పరివర్తనాత్మక ప్రయాణమని కొనియాడింది. అందుకే జనవరి 16వ తేదీని ‘నేషనల్ స్టార్టప్ డే’గా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-NCR వంటి ప్రధాన కేంద్రాలు స్టార్టప్‌ ఇండస్ట్రీలో ముందంజలో ఉన్నాయి. అయితే చిన్న నగరాలు దేశం వ్యవస్థాపక ఊపందుకోవడానికి ఎక్కువగా దోహదపడ్డాయని పేర్కొంది. ఫిన్‌టెక్, ఎడ్‌టెక్, హెల్త్-టెక్, ఇ-కామర్స్‌లోని స్టార్టప్‌లు స్థానిక సవాళ్లను అధిగమించి ప్రపంచ గుర్తింపును పొందినట్లు పేర్కొంది.

DPIIT గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య 2016లో 500 ఉండగా 2025 జనవరి 15 నాటికి వాటి సంఖ్య అనూహ్యంగా 1,59,157కి పెరిగినట్లు తెలిపింది. గతేడాది అక్టోబర్ 31 నాటికి గుర్తింపు పొందిన దాదాపు 73,151 స్టార్టప్‌లలో మహిళా డైరెక్టర్‌లు ఉన్నారని, ఇది దేశంలో మహిళా పారిశ్రామికవేత్తల పురోగతిని వెల్లడిస్తుందని కేంద్ర మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.