కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడంపై ప్రధానంగా దృష్టిసారించనున్నారు. వైద్యారోగ్యం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి బడ్జెట్‌లో సింహభాగం నిధులు కేటాయించే అవకాశం ఉన్నది. గత బడ్జెట్ మాదిరిగానే రక్షణ రంగానికి భారీగానే కేటాయింపులు కేటాయించనున్నారు. 30 అంశాలపై నిర్మల తన బడ్జెట్‌లో ప్రకటన చేసే అవకాశం ఉన్నదని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.50 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచవచ్చనే వాదన వినిపిస్తోంది. పాత పన్ను చట్టం ప్రకారం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆదాయానికి విధిస్తున్న 20% పన్నులో కొంత వరకు తగ్గింపు ఉండే అవకాశం. పెట్రోలు, డీజిల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించవచ్చనే సమాచారం. కొన్ని వ్యాపార కార్యకలాపాలపై కరోనా సెస్ విధించే అవకాశాలున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి రు.6వేల నుంచి రూ.10వేలకు పెంచే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కిసాన్ రైలు, కిసాన్ విమాన సేవ పరిధిని పెంచే అవకాశం ఉంది. వ్యవసాయ ఎగుమతులను పెంచడానికి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఏపీఎంసీ మార్కెట్ ఆధునీకరణకు ప్రత్యేక నిధులు కేటాయింపుపై బడ్జెట్‌లో ప్రస్తావించే అవకాశం ఉంది. దానితో పాటు వ్యవసాయ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పిస్తూ ప్రకటన చేయొచ్చు. పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల ఉత్పత్తిపై ప్రోత్సాహక ప్యాకేజీని ప్రకటించే అవకాశం.
సీతమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో తయారీ రంగానికి ప్రోత్సహకాలు లభించనున్నాయి. దానితో పాటు సగటు భారతీయుడి జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు సంక్షేమ పథకాలు తీసుకురానున్నారు. దానిలో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడికి వైద్య బీమా కల్పించే ప్రతిపాదన ఉంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా మూడు వైద్య పరిశోధనా సంస్థలు ఏర్పాటుకు ప్రకటన చేసే అవకాశాలున్నాయి. దేశాన్ని తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు ప్రోత్సహకాలు లభించనున్నాయి. బ్యాంకింగ్ రంగ పునరుద్ధరణ కోసం, రుణాల సామర్థ్యాన్ని పెంపునకు చర్యలు ఉండనున్నాయి.
బడ్జెట్ లైవ్ ఇక్కడ వీక్షించండి: https://tv9telugu.com/live-tv