శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర రోజుకో రికార్డు బద్దలవుతోంది. బుధవారం రికార్డు స్థాయిలో ఈ సీజన్‌లో ఏడో సారి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేయగా.. గురువారం మరో రికార్డు బద్దలైంది. 2019-20 విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించింది శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం 850 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని గురువారం ఉదయం 7 గంటలకు అధిగమించామని ఏపీ జెన్ కో చీఫ్ ఇంజినీర్ లక్ష్మణ్ రావు వెల్లడించారు.
గతంలో ఏ సింగిల్ సీజన్‌లో ఈ స్థాయిలో విద్యుదుత్పత్తి జరగలేదని ఆయనన్నారు. 850 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యానికి గాను మొత్తం 150 టీఎంసీల నీరు వినియోగించామని ఆయన తెలిపారు. ఐదు నెలల సమయం ఉండగానే ముందస్తుగా లక్ష్యాన్ని కుడి గట్టు జల విద్యుత్ కేంద్రం అధిగమించిందని ఆయన చెప్పారు.
మరోవైపు కృష్ణా నది పరవళ్ళతో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నిండుకుండల్లా మారాయి. నీటి విడుదల కొనసాగుతుండడంతో లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు.