దేశంలో నెలా 15 రోజులుగా కొనసాగుతున్న లాక్ డౌన్ చివరికి అల్లర్లకు దారితీస్తోంది. సరైన ఉపాధి లేక.. యాజమాన్యాలు వేతనాలు చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్న వలస కార్మికులు తమను నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్న పోలీసులపై ఆక్రోశాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో సోమవారం మధ్యాహ్నం అల్లర్లు చెలరేగాయి.
సూరత్ నగరంలోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వేలాది సంఖ్యలో కార్మికులు ఉండడంతో వారందరినీ ఒకేసారి తరలించడం మంచిది కాదని గుజరాత్ ప్రభుత్వం భావించింది. దశలవారీగా వారిని వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ లోగా తమకు సరైన తిండి దొరకడం లేదని, చేతుల్లో డబ్బులు కూడా లేవని కార్మికులు ఆందోళనకు దిగారు.
తమ దారి తమను చూసుకోనిస్తే ఎలాగోలా తమ స్వస్థలాలకు చేరిపోతామంటూ వలస కార్మికులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. దాంతో సూరత్ వీథులు సోమవారం మధ్యాహ్నం రక్త సిక్తమయ్యాయి. వారిని నియంత్రించడానికి ప్రయత్నించిన పోలీసులపై వలస కార్మికులు రాళ్లు రువ్వారు. దాంతో పోలీసులకు వారికి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులపై రాళ్లు రువ్వారు వలస కార్మికులు.
కేంద్ర ప్రభుత్వం వందల సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడుపుతూ తమను తమ స్వస్థలాలకు పంపేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి నిరోధిస్తుందని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దశలవారీగా వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, అదే సమయంలో లాక్‌డౌన్ నిబంధనలల్లో క్రమంగా సడలింపులు ఇస్తుండడంతో పరిశ్రమలు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారని పోలీసులు చెబుతున్నారు. కార్మికులు ఆందోళన చెందవద్దని గుజరాత్ ప్రభుత్వం కోరింది.