జగన్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు టిడిపి అధినేత చంద్రబాబు. ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్మికులకు పనిలేకుండా పోతే రాష్ట్రంలో ఇసుకు మాఫియా రాజ్యమేలుతోందని చంద్రబాబు అన్నారు. ఇసుక దొరక్క పనిలేక కార్మికులు చనిపోతే వైసీపి నేతలు ఎగతాళిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. భవననిర్మాణ కార్మికుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని బాబు ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులు కాలం చెల్లి చనిపోయారని ఎగతాళి ,అవహేళనగా మంత్రులు మాట్లాడారని, ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని చంద్రబాబు గురువారం జరిగిన టిడిపి సమీక్షా సమావేశంలో ఆరోపించారు.
ఇసుక ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తుందంటూ చంద్రబాబు ఘాటైన కామెంట్లు చేశారు. 30 లక్షల కుటుంబాలు బాధల్లో ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. బేషజాలు లేకుండా గతంలో ఉన్న ఇసుక విధానాన్ని కొనసాగించాలని బాబు డిమాండ్ చేశారు. ఉచిత ఇసుక పాలసీని కొనసాగించాలని, ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి 25 లక్షల పరిహారం ఇవ్వాలని టిడిపి అధినేత కోరారు. వారి కుటుంబాలకు టిడిపి పార్టీ పక్షాన లక్ష రూపాయాలు ఆర్దిక సహాయం అందిస్తామని చంద్రబాబు చెప్పారు.
లాంగ్ మార్చ్‌లో టిడిపి
విశాఖలో జనసేన పార్టీ నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్‌లో టిడిపి పాల్గొంటుందని చంద్రబాబు వెల్లడించారు. పవన్ లాంగ్ మార్చ్ పెట్టారు.. అందులో టిడిపి సీనియర్ నేతలు పాల్గొంటారని చంద్రబాబు చెప్పారు. ఇసుక సమస్య పరిష్కారయ్యే వరకు పోరాటం ఆగదని, ఇసుక సమస్యపై ఎవరు పోరాటం చేసిన మద్దతిస్తామని ఆయన చెప్పారు. 938 జీవోను వైయస్ తెచ్చారు.. అప్పట్లో మీడియా ప్రతినిధులు ఆందోళన చేస్తే నేను అసెంబ్లీలో మాట్లాడాను..రాజశేఖర్ రెడ్డి క్యాన్సిల్ చేశారని ఆయన వివరించారు.