ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న నేతలు తమ నోటికి పదును పెడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ఘాటైన పదజాలాన్ని వాడుతున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్‌లో బుధవారం జరిగిన అమరావతి పరిరక్షణ జెఎసీ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ మంత్రులపై పదునైన పదజాలంతో విరుచుకుపడ్డారు.
రాజధాని ఉద్యమానికి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుందని ఈ సమావేశంలో జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు ఆరోపించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నోటికి పని చెప్పారు. జగన్ కేబినెట్‌లో మంత్రులు సిగ్గుతో తలదించుకోవాలని, వారిలో మాట్లాడేందుకు ఒక్క మగాడు కూడా లేడని రామకృష్ణ వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి రాజధానిపై ప్రకటనలు చేస్తుంటే మంత్రులు కనీసం ప్రశ్నించలేకపోతున్నారని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి.. ఈ ఇద్దరు అనుకుంటే చాలా రాజధానిని ఎక్కడికైనా మార్చేస్తారా అని ప్రశ్నించారు రామకృష్ణ. రాష్ట్ర హైకోర్టును మూడు ముక్కలు చేస్తే రాయలసీమ బాగుపడదని అన్నారాయన. రాయలసీమకు నీళ్లు ఇస్తే ఆ ప్రాంతం బాగుపడుతుందని చెప్పారు. రాష్ట్ర రాజధానిని మారుస్తున్న విషయం కనీసం అయిదుగురు ఉప ముఖ్యమంత్రులకైనా తెలుసా అని నిలదీశారు రామకృష్ణ