జగన్ పాలనలో ప్రతీ కుటుంబం ఆరు నెలల్లో 15 వేల రూపాయలు నష్టపోయిందంటున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎన్నికల్లో హామీ ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చిన జగన్ ప్రతీ కుటుంబాన్ని నిలువునా ముంచేశారని పవన్ కల్యాణ్ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు.
వైసీపీ ఎన్నికల హామీలో వృద్ధాప్య పెన్షన్‌ను నెలకు 2 వేలు నుంచి 3 వేల రూపాయలకు పెంచుతామన్నారని, వృద్ధాప్య పెన్షన్ పొందే అర్హతను 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తాం అన్నారని పవన్ కల్యాణ్ వివరించారు. తీరా అధికారంలో వచ్చాక జగన్ పెన్షన్ మొత్తాన్ని 3 వేలకు పెంచలేదని, కేవలం 250 రూపాయలు కలిపి 2,250గా చేశారని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. దాంతో ఒక్కో ఒక్కో పింఛన్ లబ్ధిదారుడు 750 రూపాయలు నష్టపోతున్నారని ఆయన వివరించారు.
పెన్షన్ పొందే వయసును 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తున్నామని మే 30వ తేదీన జీవో ఎం. ఎస్. నెంబర్ 103 ద్వారా వెల్లడించారు. దాని ప్రకారం ఇప్పటి వరకు అదనంగా మరో పది లక్షల మందికి పెన్షన్ దక్కాల్సి వుంది.. కానీ ఇంత వరకు అదనంగా ఒక్కరికి కూడా పెన్షన్ లభించలేదని పవన్ కల్యాణ్ గణాంకాలు వివరించారు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న 2,250 లెక్కనే చూసుకున్నా కూడా ఒక్కో కొత్త పింఛన్ లబ్ధిదారు కుటుంబం ఈ 7 నెలల్లో 15 వేల 750 రూపాయలు కోల్పోయిందని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీకి ఓటు వేసినందుకు ఒక్కో కొత్త వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారు కుటుంబం ఈ ఏడు నెలల్లో 15 వేల 750 రూపాయలు కోల్పోయిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
గణాంకాలతో సహా పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలు, విమర్శలకు వైసీపీ నేతలెలా స్పందిస్తారో వేచి చూడాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.