Kadapa police arrested killer gang: ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి హత్య చేసేందుకు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. హత్యకు డీల్ కుదుర్చుకుని, రెండు మార్లు రెక్కీ చేసిన గ్యాంగ్‌ను కడప జిల్లాలో అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్‌లో వున్న ముగ్గురు వ్యక్తులు కర్నూలు జిల్లాకు చెందిన వారే.
కర్నూలు జిల్లా టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డిని హత మార్చేందుకు 50 లక్షలకు డీల్ కుదుర్చుకుంది ముగ్గురు వ్యక్తుల గ్యాంగ్. కర్నూలు జిల్లాకు చెందిన సూడో నక్సలైట్ సంజురెడ్డితోపాటు మరో సుబ్బారెడ్డి హత్యకు డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్యకు ప్రణాలిక రూపొందిస్తున్న సమయంలో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు కడప పోలీసులు. వీరి వద్ద నుండి 3 లక్షల 20 వేల రూపాయల నగదు, రెండు సెల్ ఫోన్లు, లైసెన్స్ లేని పిస్టల్, ఆరు తూటాలు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డ నిందితుల్లో సంజురెడ్డి అనే వ్యక్తి సూడో నక్సలైట్ గా విచారణలో వెల్లడైంది. ఈ గ్యాంగ్ ఇప్పటికే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఏవి సుబ్బారెడ్డి ఇంటి వద్ద రెండుసార్లు రెక్కి నిర్వహించినట్లు తేలింది. అయితే.. హైదరాబాద్‌లో పోలీసుల సంచారం ఎక్కువగా వుండడంతో దొరికిపోతామనే భయంతో కడపకు వచ్చేశారని, తదుపరి కుట్రను కడప నుంచి జరిపేందుకు ప్లాన్ చేశారని తెలుస్తోంది. నిందితులపై గతంలో పలు కేసులు నమోదయ్యాయని కడప డీఎస్పీ సూర్యనారాయణ వివరించారు. సుబ్బారెడ్డి హత్యకు ప్లాన్ చేసిన వారి వివరాలను ఆయన వెల్లడించారు. కర్నూలు జిల్లా సంజామల మండలం సోమల గ్రామానికి చెందిన సంధ్యాపాకుల పక్కిర అలియాస్ సంజు రెడ్డి, సిరివెళ్ళ మండలం గోవిందంపల్లి గ్రామానికి చెందిన గంగా దాసరి రవిచంద్రారెడ్డి, ఆళ్ళగడ్డ మండలం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన కుందూరు రామిరెడ్డిలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివరించారు.