దీదీ సంచలన నిర్ణయం.. జోన్లలో ఇక..!

కరోనా వ్యాప్తి వేగాన్ని సంతరించుకున్న నేపథ్యంలో దీదీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరచడం అధికార యంత్రాగానికి కత్తిమీద సాములా మారింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న కోల్‌కతా సిటీలోని అన్ని కంటైన్‌మెంట్‌ జోన్లలో...

  • Rajesh Sharma
  • Publish Date - 4:11 pm, Mon, 8 June 20
దీదీ సంచలన నిర్ణయం.. జోన్లలో ఇక..!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి వేగాన్ని సంతరించుకున్న నేపథ్యంలో దీదీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరచడం అధికార యంత్రాగానికి కత్తిమీద సాములా మారింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న కోల్‌కతా సిటీలోని అన్ని కంటైన్‌మెంట్‌ జోన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆదేశాలు జారీ చేశారు. దాని ద్వారా కంటైన్మెంట్ ఏరియాల్లో ప్రజలు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నారా? ఆంక్షలను అమలు చేస్తున్నారా లేదా అనే విషయాన్ని మరింత పక్కాగా తెలుసుకోవచ్చని దీదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కంటైన్‌మెంట్‌ జోన్లలోని ప్రజల కదలికలను లాల్‌బజార్లో ఉన్న కంట్రోల్‌ రూమ్‌ నుంచి నగర పోలీసులు నిత్యం పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. కోల్‌కతాలోని 480 కంటైన్‌మెంట్‌ జోన్లలో 500 సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి. సీఎం ఆదేశాలను శరవేగంగా అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

అధిక జనాభా ఉన్న కోల్‌కతా సిటీలో కోవిడ్‌ ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్టు కోల్‌కతా నగర పాలక అధికారులు తెలిపారు. ఇక లాక్‌డౌన్‌ సడలింపులతో దేశవ్యాప్తంగా పెరుగుతున్నట్లుగానే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోను కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. కోవిడ్‌ ఆస్పత్రులు ఉన్న ప్రాంతాలను సైతం ప్రభుత్వం కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించింది. దీంతో కోల్‌కతాలో కంటైన్‌మెంట్‌ జోన్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. పశ్చిమ బెంగాల్‌లో కంటైన్‌మెంట్‌ జోన్లను ఎఫెక్టెడ్ ఏరియాలుగా పిలుస్తున్నారు. వాటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని బఫర్‌ జోన్లుగా చెబుతున్నారు. కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలు కనుగొనేందుకు ఎఫెక్టెడ్ ఏరియాల్లోనే కొందరిని నియమించుకుంటామని అధికారులు వెల్లడించారు.