AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ మరో సంచలన నిర్ణయం.. వారందరికీ కరోనా టెస్టులు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు మరింత వేగంగా జరిగేందుకు, వీలైనంత లోకరోనా బారి నుంచి రాష్ట్రం గట్టెక్కేందుకు తాజా నిర్ణయం ఉపయోగపడుతుందని అధికార వర్గాలంటున్నాయి.

జగన్ మరో సంచలన నిర్ణయం.. వారందరికీ కరోనా టెస్టులు
Rajesh Sharma
|

Updated on: Apr 22, 2020 | 4:56 PM

Share

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు మరింత వేగంగా జరిగేందుకు, వీలైనంత లోకరోనా బారి నుంచి రాష్ట్రం గట్టెక్కేందుకు తాజా నిర్ణయం ఉపయోగపడుతుందని అధికార వర్గాలంటున్నాయి.

కోవిడ్‌–19 నివారణా చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ బుధవారం మరోసారి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్‌ –19 వైరస్‌ విస్తరణ, పరీక్షల వివరాలను సీఎంకు వివరించారు అధికారులు. ఇప్పటివరకు 41 వేల 512 మందికి పరీక్షలు చేసినట్టుగా వెల్లడించారు. ప్రతి పది లక్షల జనాభాకు 830 మందికి పరీక్షలు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో ఏపీ నిలిచిందని, 809 పరీక్షలతో రెండో స్థానంలో రాజస్థాన్‌ వుందని వారు తెలిపారు.

ట్రూనాట్‌ పరీక్షల నమోదుకు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మంగళవారం (ఏప్రిల్ 21వ తేదీ) ఒక్కరోజే 5 వేల 757 పరీక్షలు చేశామని అధికారులు వివరించగా.. ప్రస్తుతం క్వారెంటైన్‌ వున్న వారదంరికీ కరోనా టెస్టులు నిర్వహించాలని జగన్ ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న వారి సంఖ్య 7587 కాగా వారందరికీ గురువారం నుంచి కరోనా పరీక్షలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

అనంతపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఐసీయూ బెడ్లను పెంచాలని, అవసరమైతే కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న పట్టణాల్లోనే ఆస్పత్రులను గుర్తించి అక్కడే చికిత్స అందించాలని సీఎం నిర్ణయించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చూడాలని, నిత్యావసరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోను రైతాంగానికి నష్టం రాకుండా చూడాలని జగన్ తెలిపారు.

కోవిడ్‌ –19 నివారణా జాగ్రత్తలతో గ్రీన్‌ క్లస్టర్లలో కార్యకలాపాలకు సీఎం ఆదేశాలిచ్చారు. ఇచ్చిన సడలింపులు మేరకు కార్యకలాపాలు ప్రారంభించిన రంగాల్లో కరోనా వైరస్‌ నివారణా చర్యలపై అవగాహన కల్పించాలని చెప్పారు. రెడ్, ఆరెంజ్‌ క్లస్టర్లలో నిర్దేశించుకున్న నిబంధనలను పాటించాలని, గ్రీన్‌ క్లస్టర్లలో మాత్రం సడలించిన నిబంధనలమేరకు కార్యకలాపాలు కొనసాగేలా చూడాలని సీఎం వివరించారు.

దక్షిణ కొరియా కిట్లు భేష్

ర్యాపిడ్‌ టెస్టు కిట్లపైనా సీఎం సమీక్ష సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీకి రాజస్థాన్‌ తరహా చైనా కిట్స్‌ను విక్రయించేందుకు సంబంధిత వ్యక్తులు ముందుకు వచ్చారని, అవి నాసిరకంగా వుండడంతో తిరస్కరించామని అధికారులు సీఎంకు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ర్యాపిడ్‌ టెస్టు కిట్లను కొరియా నుంచి తెప్పించుకున్నామన్నారు అధికారులు. అమెరికాకు వెళ్లాల్సిన దక్షిణ కొరియా కిట్లను.. అతి కష్టమ్మీద చార్టర్‌ విమానం ద్వారా ఏపీకి తెప్పించామని అధికారులు సీఎంకు వివరించారు.