ఫార్మింగ్టన్ యూనివర్సిటీ కేసులో ఆరుగురు తెలుగువారికి జైలు శిక్ష పడింది. మరో ఇద్దరికి త్వరలో శిక్ష ఖరారు కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో సంచలనం సృష్టించిన యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ కుంభకోణం వ్యవహారంలో ఈ ఆరుగురు భారతీయులకు ఫెడరల్ కోర్టు జైలు శిక్ష విధించింది. అమెరికాలో సంచలం సృష్టించిన ఫార్మింగ్టన్ నకిలీ యూనివర్సిటీ కేసులో తెలుగు విద్యార్థులకు శిక్షలు ఖరారు చేసింది ఫెడరల్ న్యాయస్థానం.
విదేశీ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన అంతర్జాతీయ విద్యార్థి వీసా పథకం దుర్వినియోగం అవుతోందని గుర్తించిన అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్-ఐసీఈ అధికారులు. ‘పేపర్ చేజ్’ పేరుతో ఒక రహస్య ఆపరేషన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా మిచిగన్ రాష్ట్రంలోని ఫార్మింగ్టన్‌లో 2015లో నకిలీ యూనివర్సిటీని స్థాపించారు. దీనికి ‘యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్’అని పేరు పెట్టారు.
కాగితాలపైనే కనిపించే ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో ఎలాంటి సిబ్బందీ, అధ్యాపకులూ లేరు.. తరగతులు కూడా ఉండవు. అమెరికాలో అక్రమంగా నివసించాలనుకునే విద్యార్ధులుగా చేర్చుకుని ఇమ్మిగ్రేషన్ కుంభకోణాలకు పాల్పడేవారిని పట్టుకోవడమే ఈ ఆపరేషన్ లక్ష్యం. ఈ యూనివర్సిటీ నకిలీదని తెలియని ఎందరో విద్యార్థులు దళారుల ద్వారా అందులో చేరారు. అక్రమ వీసాలపై అడ్మిషన్లు తీసుకోవడంతో పాటు అమెరికాలో ఉద్యోగాలు కూడా చేసుకుంటున్న వీరందరినీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేశారు.
ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో చేరిన 145 మంది విద్యార్థులను తిరిగి స్వదేశానికి పంపేసిన అధికారులు, ఎనిమిది మంది దళారులను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. ఈ దళారులంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారే కావడంతో కలకలం చెలరేగింది. తాజాగా వీరిలో ఆరుగురికి శిక్షలు విధించింది ఫెడరల్ న్యాయస్థానం. ఇందులో సామ సంతోష్‌కు 14 నెలల జైలు శిక్ష పడింది. భరత్ కాకిరెడ్డి, సురేశ్ కందలకు 18 నెలలు, అవినాశ్ తక్కళ్లపల్లికి 15 నెలలు. అశ్వంత్ నూనె, ప్రత్తిపాటి నవీన్‌లకు 12 నెలల చెప్పున జైలు శిక్షలు పడ్డాయి. రాంపీస ప్రేమ్, కర్ణాటి ఫణిదీప్‌లకు త్వరలో శిక్షలు ఖరారు కానున్నాయి.