మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. కుల వివక్షతో ప్రణయ్ దారుణహత్యకు గురైనా అతని భార్య అమృత, వారి కుటుంబసభ్యులకు వేధింపులు మాత్రం తప్పడం లేదు. తాజాగా ఈ నెల 11న ప్రణయ్ వర్ధంతి రోజు ఓ ఆకతాయి అమృత ఇంటి తలుపుకు బెదిరింపుతో కూడిన లేఖను అంటించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఇంట్లో అమృత కుటుంబ సభ్యులు ఎవరు లేని సమయంలో హోండా షైన్ బైక్‌పై వచ్చిన ఆకతాయి దర్జాగా ఇంటి తలుపుకు లెటర్ అంటించి వెళ్లాడు. ఇంటికొచ్చిన తర్వాత లేఖ చూసిన కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లేఖలో సతీశ్ అనే వ్యక్తి ఫోటోతో పాటు కొన్ని వివరాలను దుండగుడు పొందుపరిచాడు. ప్రణయ్‌ని మరిచిపోవాలంటూ బెదిరింపు కాల్స్‌తో పాటు బయటకు వచ్చి మరో పెళ్లి చేసుకోవాలంటూ ఇటీవలి కాలంలో అమృతకు వేధింపులు ఎక్కువయ్యాయి. గతంలో కూడా తమకు బెదిరింపు మెసేజీలు, కాల్స్ రావడంతో అమృత, ఆమె కుటుంబ సభ్యులు సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో కొంతకాలంగా అవి ఆగిపోయాయి. కానీ ఇటీవల కాలంలో అవి పునరావృతం కావడంతో వారు ఆందోళన చెందుతున్నారు.