ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కనిపించకుండాపోయిన వ్యక్తి శవమైన తేలాడు. సూరజ్‌పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏనుగుల దాడిలో మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రతాప్‌పూర్ ఫారెస్ట్ రేంజ్‌లోని పఖ్నీ గ్రామానికి చెందిన శంకర్‌సింగ్ అనే 60 ఏండ్ల వృద్ధుడిని అటవీ ప్రాంతంలోకి వెళ్లి కనిపించకుండా పోయాడు. జూలై 6న పొరుగూరు పరమేశ్వర్‌కు వెళ్లిన శంకర్‌సింగ్ స్వగ్రామానికి తిరిగిరాలేదు. దీంతో చుట్టుపక్కల అంతటా గాలించిన కుటుంబసభ్యులు ఆచూకీ లభించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి గాలింపు చేపట్టిన పోలీసులు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం చుట్టూ ఏనుగుల అడుగులు ఉండటాన్ని బట్టి ఏనుగుల మందే శంకర్‌సింగ్‌ను తొక్కిచంపినట్లు నిర్ధారించారు. కాగా, శంకర్‌సింగ్ గతంలో జిల్లా పరిషత్ సభ్యుడిగా కూడా పనిచేసినట్లు స్థానికులు చెప్పారు. మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.