దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్ల నిషేధం.. ఊదారంటే జైలే గతి !
ఎలెక్ట్రానిక్ (ఈ) సిగరెట్లపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీటి ఉత్పత్తి, తయారీ, అమ్మకాలు, పంపిణీ లేదా యాడ్ లు ఇక శిక్షార్హ నేరాలని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు క్యాబినెట్ ఓ నిర్ణయాన్ని ఆమోదించిందని అన్నారు. ఇండియాలో ముఖ్యంగా యువత వీటికి అడిక్ట్ కావడం ఆందోళన కలిగిస్తోందని ఆమె చెప్పారు. ఈ-సిగరెట్ల నిషేధానికి సంబంధించిన ఆర్డినెన్సు ను అధ్యయనం చేసిన మంత్రుల బృందానికి నిర్మల ‘ సారథి ‘గా […]
ఎలెక్ట్రానిక్ (ఈ) సిగరెట్లపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వీటి ఉత్పత్తి, తయారీ, అమ్మకాలు, పంపిణీ లేదా యాడ్ లు ఇక శిక్షార్హ నేరాలని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు క్యాబినెట్ ఓ నిర్ణయాన్ని ఆమోదించిందని అన్నారు. ఇండియాలో ముఖ్యంగా యువత వీటికి అడిక్ట్ కావడం ఆందోళన కలిగిస్తోందని ఆమె చెప్పారు. ఈ-సిగరెట్ల నిషేధానికి సంబంధించిన ఆర్డినెన్సు ను అధ్యయనం చేసిన మంత్రుల బృందానికి నిర్మల ‘ సారథి ‘గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. వీటిని స్టోరేజీ చేసిన పక్షంలో ఆరు నెలల పాటు జైలుశిక్ష, లేదా 50 వేల జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. అలాగే వీటి ఉత్పత్తి, తయారీ, పంపిణీ, అమ్మకాలువంటివి చేస్తే మొదట ఏడాది పాటు జైలుశిక్ష, లేదా లక్ష రూపాయల ఫైన్, లేదా రెండూ విధిస్తారు. రెండో సారి పట్టుబడితే మూడేళ్ళ వరకు జైలు, 5 లక్షల జరిమానా విధిస్తారు. ఈ-సిగరెట్లు పొగాకును మండించవు. కానీ హీటింగ్ ఎలిమెంట్లను వినియోగించినప్పుడు లిక్విడ్ నికోటిన్ ఆవిరిగా మారుతుంది. దీన్ని యూజర్ పీల్చడం హానికరం. ఇండియాలో వీటికి లైసెన్స్ లేదు. సిగరెట్ల కన్నా ఇవి హానికరం కానప్పటికీ స్మోకర్లు స్మోకింగ్ ను మానేసేందుకు వీటిని వాడుతారు. దేశంలో 460 కి పైగా ఈ-సిగరెట్ బ్రాండ్లు లభ్యమవుతున్నాయట. 7,700 ఫ్లేవర్లతో ఈ బ్రాండ్లు మార్కెట్లలో దొరుకుతున్నాయి. కాగా-ఆర్డినెన్స్ జారీ కాగానే ఈ-సిగరెట్ల స్టాకులు కలిగిఉన్నవారు వెంటనే ఈ విషయాన్ని ప్రకటించి.. డిపాజిట్ స్టాక్స్ ని సమీప పోలీసు స్టేషన్లలో అప్పగించాల్సి ఉంటుంది. ఓ ఎస్ఐ ఈ స్టాక్స్ ను పరిశీలించి వీటిని స్వాధీనం చేసుకుంటారు. అమెరికా వంటి దేశాల్లో కూడా ఈ-సిగరెట్లపై బ్యాన్ ఉంది. అటు-కేంద్రం వీటిని నిషేధిస్తున్నట్టు ప్రకటించగానే సాధారణ సిగరెట్ల తయారీ కంపెనీల షేర్లు పెరగడం విశేషం.