బిగ్ బాస్-3 షో పై రేగిన వివాదం సద్దు మణిగినట్టే కనిపిస్తోంది. ఈ షో నిర్వాహకులపై యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా రెండు వేర్వేరు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదులను పరిశీలించేందుకు స్టార్ మా ఛానల్ ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. సెక్స్యువల్ హరాస్ మెంట్ ఆఫ్ వుమెన్ ఎట్ వర్క్ ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్, రిడ్రెసల్)యాక్ట్-2013 కింద ఇలా కమిటీని ఏర్పాటు చేయడం తప్పనిసరి.. తమ పట్ల ఈ షో నిర్వాహకుల్లో ఎవరు అసభ్యంగా ప్రవర్తించారో వారి పేర్లతో సహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని ఈ కమిటీ బాధితులను కోరింది. బంజారాహిల్స్, రాయదుర్గం పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. బిగ్ బాస్ ఆర్గనైజర్లయిన నలుగురు తనపట్ల అసభ్యంగా వ్యవహరించారని మహిళా జర్నలిస్టు కూడా అయిన శ్వేతారెడ్డి బంజారాహిల్స్ పీఏస్ లో కంప్లయింట్ చేశారు. మరునాడే నటి గాయత్రి గుప్తా కూడా ఇదే విధమైన ఆరోపణలతో రాయదుర్గం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో.. ఈ పోలీసు స్టేషన్లలో 354 ఐపీసీ సెక్షన్ కింద షో నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా-ఈ షో క్రియేటివ్ డైరెక్టర్ అభిషేక్ ముఖర్జీపై బలవంతంగా ఎలాంటి చర్యలూ తీసుకోరాదని తెలంగాణ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.