కరోనా భయం పోయింది. కానీ, దాని విరుగుడు కోసం వేసుకున్న వ్యాక్సిన్లు మాత్రం జనాలను ఇంకా భయపెట్టేస్తున్నాయి. వ్యాక్సిన్లకు సంబంధించి తాజాగా వెలుగులోకి వస్తున్న విషయాలే దీనికి ప్రధాన కారణం. ఈ డోసులతో.. దీర్ఘకాలికంగా దుష్ప్రభావాలు ఉంటాయంటూ కొన్ని పరిశోధనలు నిర్ధారిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
కోవాగ్జిన్ పనితీరుపై బెనారస్ యూనివర్సిటీ లేటెస్ట్‌గా, పెద్ద బాంబే పేల్చింది. స్వదేశీ టీకా కోవాగ్జిన్‌తో మూడో వంతు మంది.. తొలిఏడాదే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని బెనారస్ హిందూ యూనివర్శిటీ తన అధ్యయనంలో తేల్చింది. వారంతా, తీవ్రమైన ప్రతికూలప్రభావాలు ఎదుర్కొన్నట్టు.. తమ సర్వేలో చెప్పారని స్పష్టం చేసింది. దీంతో, వ్యాక్సిన్ల అంశం తీవ్ర చర్చకు దారితీసింది.
కోవాగ్జినే కాదు.. ఇటీవల కొవిషీల్డ్‌పైనా ఇలాంటి ముచ్చటే బయటకు వచ్చింది. కోవిషీల్డ్ టీకా అరుదైన సందర్భాల్లో థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్-TTSకు కారణమవుతుందనీ… దీనివల్ల కొంతమందికి రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోవటం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయనీ తేలింది. అయితే, అప్పటిదాకా తమ టీకా సురక్షితమే అని చెప్పిన బ్రిటీష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా… అసలు విషయాన్ని అంగీకరించింది. కోవిషీల్డ్‌తో సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనని ప్రకటించింది.
కరోనా విలయతాండవం చేస్తున్నవేళ అపరసంజీవిగా ఉద్భవించిన కోవీషీల్డ్.. ఆ తర్వాత మెల్లగా మార్కెట్‌లోకి వచ్చిన కోవాగ్జిన్… ప్రజలకు భారీ ఉపశమనాన్నే కలిగించాయి. అయితే, ప్రస్తుతం వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న ప్రచారాలు.. మరోసారి ఆందోళన పెంచుతున్నాయి. ఇప్పటికే బ్రిటన్‌లో కోవిషీల్డ్ సరఫరా ఆగిపోగా… కోవాగ్జిన్ విషయంలో మాత్రం, తయారీ సంస్థ తమ సెఫ్టీ ట్రాక్ రికార్డ్ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తోంది. వైద్యులు మాత్రం వ్యాక్సిన్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా జనాల్లో ఒక అయోమయం క్రియేట్ అయ్యిందన్నది మాత్రం నిజం.