Big News Big Debate: రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి మల్లారెడ్డి మధ్య సవాళ్ల యుద్ధం పొలిటికల్‌గా పీక్ స్టేజ్‌కు చేరింది. మాటల తూటాలు ఓ రేంజ్‌లో పేలుతున్నాయి. వీళ్లకు కొనసాగింపుగా మరికొంతమంది నేతలు కూడా ఈ క్షేత్రంలో మోహరించి అగ్గికి ఆజ్యం పోస్తున్నారు. సీఎం కేసీఆర్ గురించి అడ్డదిడ్డంగా మాట్లాడితే నాలుక కోస్తామని వార్న్ చేశారు టీఆర్ఎస్ నాయకులు. మీరే నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హస్తం నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. సవాళ్లు సరే.. అటు రేవంత్, ఇటు మల్లారెడ్డి రాజీనామాలు చేసి మేడ్చల్ యుద్ధంలో దిగుతారా? పొలిటికల్ యుద్ధమంటూ వస్తే ఇప్పటికే బీజేపీ కూడా రంగంలో దిగుతుందా.?
తగ్గేదే లే.. మాటంటే మాటే. కావాలంటే టైం తీసుకో.. రాజీనామా చేసి రా.. పబ్లిక్‌లో తేల్చుకుందాం అంటూ సవాల్ చేశారు మంత్రి మల్లారెడ్డి. ఇంటిపై కోడిగుడ్లు, టమోటాలతో దాడులు చేయించడం కాదని, దమ్ముంటే రాజీనామా చేసి రావాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ చేశారు మల్లారెడ్డి. అయితే రాజీనామా చేయాల్సిందే రేవంత్ కాదని.. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి చేస్తే పోటీకి సిద్దమని కాంగ్రెస్ ప్రతిసవాల్ విసిరింది. గజ్వేల్‌లో సీఎం రాజీనామా చేసినా మాకు ఓకే అంటున్నారు అద్దంకి దయాకర్.
మేడ్చల్ సవాళ్లు నడుస్తుండగానే.. గులాబీ దండు హస్తంపై యుద్ధం మొదలుపెట్టింది. కేసీఆర్ కోసమే బతుకుతున్నాం.. కేసీఆర్ కోసం చావడానికి సిద్దమంటున్న ఎమ్మెల్యే లు కాంగ్రెస్ నేతలపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. మా నాయకుడి గురించి ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడితే నాలుక కోస్తామంటూ హెచ్చరించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి. రేవంత్‌రెడ్డి తీరుపై సోనియాకు, రాహుల్‌కు లేఖ కూడా రాశానన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే.
అయితే ఇరు పార్టీల మధ్య జరుగుతున్న మాటలయుద్ధాన్ని బీజేపీ లైట్‌గా తీసుకుంటుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు సహజమిత్రులేనని.. వారి మధ్య నడుస్తుందని డ్రామా తప్ప పోలిటికల్ యుద్ధం కాదంటోంది.
బూతుపురాణాలు.. సవాళ్ల పర్వంతో తెలంగాణ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్ బైపోల్‌తో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పుడే మేడ్చల్‌లో కూడా నాయకులు సవాళ్లను మరింత ముందుకు తీసుకెళ్లి యుద్ధానికి సిద్దమవుతారా? చూడాలి.
(బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్)
ఇదే అంశంపై టీవీ9 స్టూడియోలో బిగ్ డిబేట్ జరిగింది.. పూర్తి సమాచారం కోసం కింద వీడియో చూడండి..