ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్న శుక్రుడి కారణంగా అక్టోబర్ 1వ తేదీ వరకు ఆరు రాశులకు శుక్ర యోగం పడుతోంది. శుక్రుడు తన వక్రగతిని వదిలిపెట్టి రుజు వర్తనలో ఉండడం దీనికి బాగా దోహదం చేస్తోంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్ర యోగం అంటే తేలికగా, సునాయాసంగా, అప్రయత్నంగా డబ్బు సంపాదించడం. ఈజీ మనీ అన్నమాట! ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశాలుంటాయి. లాటరీలు, జూదం, వడ్డీ వ్యాపారం, అవినీతి వగైరాలన్నీ ఈ కోవలోకే వస్తాయి. శుక్ర గ్రహం అనుకూలంగా ఉన్నందువల్లే రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వారు, సినిమా నటులు తదితరులు అతి తక్కువ ప్రయత్నంతో అతి తక్కువ కాలంలో అపర కుబేరులవుతుంటారు. ప్రస్తుతం మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశులకు ఈ యోగం పట్టింది. వ్యక్తిగత జాతక చక్రాన్ని బట్టి ఈ యోగం వర్తించడంలో కొద్దిగా హెచ్చుతగ్గులుంటే ఉండవచ్చు కానీ, ఇది వర్తించడం మాత్రం ఖాయం.
మేషం: ఈ రాశివారికి శుక్రుడు నాలుగవ స్థానమైన కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అత్యధికంగా లాభపడడం జరుగుతుంది. భూ సంబంధమైన క్రయ విక్ర యాల్లో విశేషమైన లాభాలు పొందడం జరుగుతుంది. ఆస్తులు కొనడం గానీ, ఆస్తి విలువ పెరగ డం గానీ జరుగుతుంది. రైతులు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. నాలుగవ రాశి సంచారం వల్ల శుక్రుడికి దిగ్బలం పడుతుంది. ఫలితంగా గృహ, వాహన సౌకర్యాలు కూడా ఏర్పడతాయి.
మిథునం: ఈ రాశికి రెండవ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఉద్యోగంలో జీత భత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో బాగా లాభాలు గడించడం వంటివి జరుగుతాయి. అనేక మార్గాల్లో ధనార్జన పెరుగు తుంది. భార్య వైపు నుంచి లేదా తల్లి వైపు నుంచి సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. స్త్రీ మూలక ధన ప్రాప్తి సూచనలు కూడా ఉన్నాయి. రాదనుకుని వదిలేసుకున్నడబ్బు కూడా చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. జీవిత భాగస్వామి ఆదాయం కూడా పెరగ వచ్చు.
కర్కాటకం: ఈ రాశిలో శుక్ర గ్రహ సంచారం జరుగుతున్నంత కాలం ఈ రాశివారికి ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. ఆర్థిక లాభం కలుగుతూనే ఉంటుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడించడం వంటివి జరుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం కూడా ఉంది. ఆస్తి విలువ పెరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు అమరుతాయి. రియల్ ఎస్టేట్ వారు మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతారు.
కన్య: ఈ రాశివారికి శుక్రుడు లాభ స్థానంలో సంచరిండం వల్ల తప్పకుండా అత్యధిక లాభం ఉంటుంది. అనుకోకుండా, అప్రయత్నంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతూ ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల వరకూ ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభ దాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల శాతం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో జీత భత్యాలతో పాటు బోనస్ తదితర ప్రోత్సాహకాలు కూడా అందుతాయి.
తుల: ఈ రాశినాథుడైన శుక్రుడు దశమ కేంద్రంలో సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగానే కాకుండా, అదనపు ఆదాయ మార్గాల ద్వారా కూడా ఆర్జన పెరిగే అవకాశం ఉంది. రాజ కీయాలు, సినిమా, రియల్ ఎస్టేట్ రంగాలకు చెందినవారికి సంపాదన మరింతగా పెరుగు తుంది. తండ్రి వైపు నుంచి సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. స్త్రీమూలక ధన ప్రాప్తి ఉంటుంది. ఆస్తిపాస్తుల విలువ అంచనాలకు మించి పెరుగుతుంది.
మకరం: ఈ రాశివారికి సప్తమ స్థానమైన కర్కాటకంలో శుక్ర సంచారం జరుగుతున్నందువల్ల, వృత్తి, ఉద్యోగాల ద్వారా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరిగి విపరీతమైన సంపాదన ఉంటుంది. భార్య తరఫు నుంచి ఆస్తి కలిసి వచ్చే సూచనలున్నాయి. ఆస్తి వివాదానికి సంబంధించిన కోర్టు కేసు ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల సంపాదన పెరగడం జరుగుతుంది.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.