Shukra Gochar in Dhanu Rashi
ప్రస్తుతం ధనూ రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు డిసెంబర్ 2వ తేదీ వరకూ ఇదే రాశిలో కొనసాగుతాడు. ఈ రాశిలో శుక్రుడి సంచారం కొన్ని రాశులకు లాభకరమే కానీ, సాధారణంగా వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశులకు దుస్థానాల్లో ఉన్నందువల్ల శుక్రుడు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఈ శుక్రుడు గురువుతో పరివర్తన చెందినందువల్ల అశుభ ఫలితాలను తక్కువగాను, శుభ ఫలితాలను ఎక్కువగాను ఇచ్చే అవకాశం ఉంది.
- వృషభం: రాశ్యధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల సాధారణంగా దంపతుల మధ్య మనస్పర్థలు కలిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాల్లో ప్రతిష్టంభన ఏర్పడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందదు. అయితే, శుక్రుడు గురువుతో పరివర్తన చెందినందువల్ల ఈ సమస్యలేవీ చుట్టు ముట్టకపోవచ్చు. ఆస్తి వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కడం జరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశముంది.
- మిథునం: సప్తమ స్థానంలో శుక్ర సంచారం దాంపత్య సమస్యలను సృష్టిస్తుంది. దంపతుల మధ్య తాత్కాలిక ఎడబాటును కూడా కలిగిస్తుంది. పెళ్లి సంబంధాలు చివరి క్షణంలో వెనక్కిపోవచ్చు. రావలసిన డబ్బు రాకపోవచ్చు. అయితే, ఈ శుక్రుడికి సప్తమ స్థానాధిపతి గురువుతో పరివర్తన జరిగినందు వల్ల దాంపత్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉండదు. అన్యోన్యత బాగా పెరుగుతుంది. గతంలో ఏవైనా సమస్యలున్నా ఇప్పుడు పరిష్కారమవుతాయి. ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి.
- కర్కాటకం: ఈ రాశికి షష్ట స్థానంలో శుక్ర సంచారం వల్ల సాధారణంగా వైవాహిక సమస్యలతో పాటు ఉద్యోగ సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. అయితే, లాభ స్థానంలో ఉన్న గురువుతో శుక్రుడికి పరివర్తన జరిగినందువల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందుతాయి. దాంపత్య జీవి తంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంటుంది. అనారోగ్య సమస్యలు బాగా తగ్గుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.
- తుల: రాశ్యధిపతి శుక్రుడు తృతీయ స్థానంలో సంచారం చేయడం వల్ల సాధారణంగా కష్టార్జితం బాగా వృథా అయ్యే అవకాశం ఉంటుంది. ఏ ప్రయత్నమూ కలిసి రాక ఇబ్బంది పడడం కూడా జరుగు తుంది. ప్రయాణాల్లో ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయితే, శుక్రుడు గురువుతో పరివర్తన చెందడం వల్ల ఈ దోషాలు తొలగిపోయే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాల వల్ల ఇబ్బడిముబ్బడిగా లాభాలు కలుగుతాయి.
- మకరం: ఈ రాశికి వ్యయ స్థానంలో శుక్ర సంచారం వల్ల అనవసర పరిచయాలు, వ్యసనాల మీద ఖర్చులు పెరుగుతాయి. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవుతుంది. వైద్య ఖర్చులు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే, పంచమ స్థానంలో ఉన్న గురువుతో శుక్రుడికి పరివర్తన జరిగి నందు వల్ల ఈ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు చేయడం, షేర్లలో మదుపు చేయడం వంటివి చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
- మీనం: ఈ రాశికి పరమ పాప గ్రహమైన శుక్రుడు దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగ భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి, వేధింపులు పెరగడం కూడా జరుగుతుంది. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, రాశ్యధిపతి గురువుతో పరివర్తన వల్ల శుక్రుడు శుభ గ్రహంగా మారి, ఉద్యోగపరంగా శుభ పరిణామాలు కలగజేయడం జరుగు తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు లాభాలు పండిస్తాయి.