Rasi Adhipathi
ఏ రాశికైనా రాశ్యధిపతి బలంగా ఉన్న పక్షంలో సమస్యలు ఒక పట్టాన దగ్గరకు రావు. సమస్యలున్నా పరిష్కారం అయిపోతాయి. సమస్యలను పరిష్కరించుకోగల శక్తిసామర్థ్యాలు ఏర్పడతాయి. ఆ విధంగా చూస్తే ఏడు రాశుల వారికి రాశ్యధిపతి బాగా బలంగానూ, అనుకూలంగానూ ఉన్నందువల్ల వ్యక్తిగత, కుటుంబ, జీవన, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో దాదాపు ప్రతి సమస్యా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో గ్రహాల స్థితిగతులు అనుకూలంగా ఉన్నా, లేకపోయినా, గ్రహ సంచారంలో రాశ్యధిపతి అనుకూలంగా ఉంటే సమస్యల తీవ్రత చాలావరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆ ఏడు రాశులుః మేషం, వృషభం, సింహం, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం.
- మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు వృశ్చికంలో అంటే తన స్వస్థానంలో రవితో కలిసి ఉన్నందు వల్ల చాలావరకు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి, పురోగతికి మార్గం సుగమం అవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో అవస్థలు పడుతున్నవారు సైతం కోలుకోవడం ప్రారంభం అవుతుంది. రాశ్యధిపతి కుజుడు స్వస్థా నంలోనే అయినప్పటికీ అష్టమ స్థానంలో ఉన్నందువల్ల కొద్దిపాటి ప్రయత్నం అవసరమవుతుంది.
- వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు తులా రాశిలో స్వస్థానంలో బలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి ఆర్థిక సంబంధమైన సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుట పడుతుంది. ఆరోగ్య సంబంధమైన సమస్యలకు సరైన వైద్యం లభించే అవకాశం ఉంది. శత్రు వులు, ప్రత్యర్థులు, పోటీదార్లు వెనక్కి తగ్గుతారు. ఈ శుక్రుడు షష్ట స్థానంలో ఉన్నందువల్ల కొద్ది పాటి ప్రయత్నం తప్పదు. కొందరు కుటుంబ సభ్యులు, బంధువులతో విభేదాలు కూడా సమసిపోతాయి.
- సింహం: ఈ రాశి అధిపతి అయిన రవి తన మిత్రక్షేత్రమైన వృశ్చికంలో, మిత్రుడైన కుజుడితో కలిసి ఉండడం వల్ల వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన ఎటువంటి సమస్య అయినా సునాయాసంగా, అప్రయత్నంగా తొలగిపోతుంది. గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబ సమస్యలకు ఆశించిన స్థాయిలో పరిష్కారం లభిస్తుంది. కబ్జాలో ఉన్న స్థలాలు తిరిగి స్వాధీనం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- తుల: ఈ రాశినాథుడైన శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి వ్యక్తిగత సమస్యలు ఎలాంటివైనా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మంచి వైద్యం, చికిత్స అందుబాటులోకి వస్తాయి. వ్యక్తిగత పురోభివృద్ధికి ఎదురవుతున్న ఆటంకాలు, అవరోధాలు అతి తక్కువ ప్రయత్నంతో తొలగిపోతాయి. విదేశీయానానికి సంబంధించిన సమ స్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితంలో కూడా అపార్థాలు తొలగి, సామరస్యం ఏర్పడుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల కొత్తగా సమస్యలు దగ్గరకు వచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం అనుభవంలో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరుకు తుంది. ఒక్కొక్క సమస్యను మొండిగా, సమయస్ఫూర్తిగా పరిష్కరించుకుంటారు. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు వాటంతటవే పరిష్కారం అవుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు సరైన వైద్యం, చికిత్స లభిస్తాయి. రుణ భారం బాగా తగ్గుతుంది.
- ధనుస్సు: ఈ రాశ్యధిపతి అయిన గురువు పంచమ స్థానంలో మిత్ర క్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల గట్టి ప్రయత్నంతో, గట్టి పట్టుదలతో ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకోవడం జరుగుతుంది. వ్యక్తిగత, కుటుంబ, పిల్లల, ఆరోగ్య, ఆర్థిక సమస్యలు చాలావరకు తొలగిపోయి, మనశ్శాంతి ఏర్పడుతుంది. వీసా సమస్యలు గానీ, విదేశాల్లో స్థిరపడడానికి సంబంధించిన సమస్యలు గానీ కొద్ది ప్రయత్నంతో పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ అతి తేలికగా సఫలం అవుతాయి.
- మకరం: ఈ రాశ్యధిపతి శనీశ్వరుడు ధన స్థానంలో, స్వస్థానంలో సంచరించడం వల్ల ఈ రాశివారికి ఉన్న ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కూడా సమస్యలు, చిక్కుముడులు తొలగిపోయి, జీవనం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధుమిత్రులతో ఉన్న విభేదాలు, వివాదాలు తొలగిపోయి, సఖ్యత, సామరస్యం పెరుగుతాయి. కుటుంబ జీవితంలో కూడా అనుకూలత ఏర్పడుతుంది.