Shubh Yogas: ప్రధాన గ్రహాల అనుకూలత.. 40 రోజులు ఆ రాశుల వారికి అన్నింటా శుభాలే..!

Telugu Astrology: ప్రస్తుతం ఆరు రాశులు (మేషం, వృషభం, తుల, ధనుస్సు, మకరం, మీనం) అదృష్టాన్ని అందిస్తాయి. శుభ గ్రహాల అనుకూలతతో ఫిబ్రవరి ఆఖరు వరకు వీరికి ధన, ఉద్యోగ, వివాహ యోగాలు పడతాయి. విదేశీ ప్రయాణాలు, ఆస్తి లాభాలు కూడా కలుగుతాయి. ఈ సమయం వీరి జీవితాల్లో గొప్ప సానుకూల మార్పులను తెస్తుంది.

Shubh Yogas: ప్రధాన గ్రహాల అనుకూలత.. 40 రోజులు ఆ రాశుల వారికి అన్నింటా శుభాలే..!
Shubh Yogas

Edited By:

Updated on: Jan 10, 2026 | 5:19 PM

ప్రస్తుతం ఆరు రాశులకు ప్రధాన గ్రహాలన్నీ బాగా అనుకూలంగా ఉన్నాయి. మేషం, వృషభం, తుల, ధనుస్సు, మకరం, మీన రాశులకు తప్పకుండా శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. అధికార యోగం, ధన యోగం, విదేశీయానం, ఉద్యోగం, పెళ్లి, ప్రేమల్లో వీరికి ఇది కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఈ అనుకూల సమయం దాదాపు ఫిబ్రవరి ఆఖరు వరకూ కొనసాగే అవకాశం ఉంది. శని, గురువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాల అనుకూలత వల్ల ఈ రాశులవారు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. వీరి జీవితాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి.

  1. మేషం: ఈ రాశివారికి రాశ్యధిపతి కుజుడు 9, 10 స్థానాల్లో సంచారం చేయడం, మిగిలిన గ్రహాలు కూడా భాగ్య, దశమ, లాభ స్థానాల్లో ఉండడం వల్ల మనసులోని కోరికలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలతో పాటు ఆర్థికంగా కూడా బాగా కలిసి రావడం జరుగుతుంది. అనేక విధా లుగా సంపద పెరుగుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. సంతానం లేనివారికి సంతాన యోగం కలగడానికి కూడా అవకాశం ఉంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
  2. వృషభం: రాశ్యధిపతి శుక్రుడు, ఇతర ప్రధాన గ్రహాలు భాగ్య స్థాన ప్రవేశం చేయడం, శని లాభ స్థానంలో ఉండడం వల్ల ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. ధన ధాన్య సమృద్ధి యోగం, విదేశీ సంపాదన యోగం కలుగుతాయి. రావలసిన డబ్బు అందడంతో పాటు ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి.
  3. తుల: ఈ రాశివారికి రాహు కేతువులతో సహా ప్రతి ప్రధాన గ్రహమూ అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి అనేక విధాలుగా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు రాబడి బాగా వృద్ధి చెందుతుంది. సంపన్నులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ ప్రయత్నాలు సఫలం అవుతాయి. విదేశీ సొమ్ము అనుభవించే యోగం ఉంది. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు అందుతాయి.
  4. ధనుస్సు: ఒక్క శని మినహా మిగిలిన గ్రహాలన్నీ చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారికి మహా భాగ్య యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతికి, జీతభత్యాలు బాగా పెరగడానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. వారసత్వ సంపద కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగపరంగా శుభవార్తలు వింటారు.
  5. మకరం: ఈ రాశిలో త్వరలో నాలుగు అనుకూల గ్రహాలు చేరడంతో పాటు శని, రాహువులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనేక విధాలుగా విశేషంగా ఆర్థిక లాభాలు పొందుతారు. రాజయోగాలు కలుగుతాయి. రాజపూజ్యాలు లభిస్తాయి. ధన ధాన్య సమృద్ధి యోగం పడుతుంది. అదనపు ఆదాయానికి, అదనపు రాబడికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు అంచనాలకు మించిన జీతభత్యాలతో ఉద్యోగం లభిస్తుంది. సంపన్నులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
  6. మీనం: నాలుగు గ్రహాలు లాభస్థానంలో ప్రవేశించడంతో పాటు రాశ్యధిపతి గురువు కూడా చతుర్థ స్థానంలో అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి శని ప్రభావం తగ్గడంతో పాటు ధన, రాజ యోగాలు పట్టడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. సిరిసంపదలు బాగా వృద్ది చెందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. పదోన్నతికి, జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా ఉంది.