
Mauni Amavasya 2025
మాఘ మాసంలో వచ్చే మౌని అమావాస్యను అత్యంత పవిత్రమైన అమావాస్యగా పరిగణిస్తారు. జ్యోతిషపరంగానే కాకుండా, ఆధ్యాత్మికపరంగా కూడా ఈ అమావాస్యకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ నెల 29న మకర రాశిలో సంభవిస్తున్న ఈ అమావాస్యనాడు కొన్ని నియమాలు పాటించే పక్షంలో శని, రాహు, కేతు, కుజ గ్రహాలకు సంబంధించిన దోషాలన్నీ పరిహారం అవుతాయని.. సకల సంపదలు కలుగుతాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. జనవరి 28 సాయంత్రం 7.35 నుంచి 29 సాయంత్రం 6.05 గంటలకు ఉండే ఈ అమావాస్య రోజున మౌన వ్రతం, ఉపవాస దీక్ష, ధ్యానం పాటించడం వల్ల ఏడాదంతా శుభప్రదంగా సాగిపోయే అవకాశం ఉంది. కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాశుల వారు ఈ నియమాలలో ఒక్కదాన్నయినా పాటించవలసి ఉంటుంది.
- కర్కాటకం: ఈ నెల 28 సాయంత్రం నుంచి 29 సాయంత్రం వరకు ఈ రాశివారు తప్పకుండా మౌన వ్రతం, ధ్యానం పాటించడం వల్ల అర్ధాష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. గురు, బుధ, శుక్రుల వల్ల రెట్టింపు శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఈ రోజు నుంచి ఈ రాశివారి జీవితం అనేక విషయాల్లో కొత్త పుంతలు తొక్కుతుంది. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులు లభించి ప్రాధాన్యం, ప్రాభవం వృద్ధి చెందుతాయి. ఆరోగ్య లాభం కలుగుతుంది.
- సింహం: ఈ రాశివారు ఈ అమావాస్య తిథిలో తప్పకుండా ఉపవాసం, ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. చాలా కాలంగా ఇబ్బందిపెడుతున్న కొన్ని ఒత్తిళ్లు, సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలా త్వరగా సఫలం అవడం జరుగుతుంది.
- వృశ్చికం: అర్ధాష్టమ శని, పంచమంలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారు పడుతున్న కష్టనష్టాలకు మౌని అమావాస్య విరుగుడు లభిస్తుంది. ఈ రాశివారు మౌన వ్రతం పాటించడంతో పాటు కొద్దిగా ధ్యానం చేయడం వల్ల తప్పకుండా అనేక సమస్యల నుంచి బయటపడడంతో పాటు, ఊహించని పురోగతి కలుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందడంతో పాటు ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. సంతాన యోగం కూడా కలుగుతుంది.
- మకరం: ఈ రాశివారికి కొద్దిపాటి ఏలిన్నాటి దోషం కొనసాగుతున్నందువల్ల పరమ పవిత్రమైన అమావాస్య రోజున ఉపవాస దీక్ష చేపట్టడం చాలా మంచిది. అనేక ప్రయత్నాలకు, కార్యక్రమాలకు ఆటంకాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. కొత్త ఉద్యోగులకు స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగులు మరింత మంచి అవకాశాలు అందివస్తాయి. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందుతారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.
- కుంభం: ఏలిన్నాటి శని ప్రభావంలో ఉన్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా మౌని అమావాస్య రోజున మౌనవ్రతంతో పాటు ధ్యానం చేయడం మంచిది. దీనివల్ల ఏడాదంతా వీరికి శుభప్రదంగా, సానుకూలంగా గడిచిపోతుంది. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.
- మీనం: ఏలిన్నాటి శని ప్రభావంతో పాటు, రాహుకేతువుల దుష్ప్రభావంలో కూడా ఉన్న ఈ రాశివారు మౌని అమావాస్య రోజున ఉపవాసం చేయడం చాలా మంచిది. ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఈ ఏడాదంతా ఏలిన్నాటి శని దోషం నుంచి బయటపడడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.