
Mars And Saturn
జ్యోతిషశాస్త్రంలో కుజుడికి చాలా ప్రాధాన్యం ఉంది. ధైర్య సాహసాలకు, తెగువకు, పట్టుదలకు, పోరాటాలకు మారుపేరైన కుజుడు రాశి మారినప్పుడల్లా కొన్ని రాశులవారి వైభవం పెరుగుతుంది. డిసెంబర్ 7వ తేదీ నుంచి జనవరి 15 వరకు కుజుడు ధనూ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. గురువుకు చెందిన ధనూ రాశిలో కుజుడు సంచారం చేయడం తప్పకుండా ఆదాయ పరంగా అదృష్టాలను కలగజేస్తుంది. ప్రస్తుతం ధనూ రాశిలోని కుజుడు, మీన రాశిలోని శని పరస్పరం వీక్షించుకోవడం కూడా యోగదాయకం అవుతుంది. మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారి జీవితాలు ఈ వీక్షణ వల్ల సానుకూల మలుపులు తిరుగుతాయి.
- మేషం: ఏలిన్నాటి శని వల్ల జీవితంలో ఏర్పడిన స్తబ్ధత, నిరాసక్తత రాశ్యధిపతి కుజుడి దృష్టి వల్ల ఒక్క సారిగా మటుమాయం అవుతాయి. రాశ్యధిపతి కుజుడు భాగ్య స్థానంలో ప్రవేశించి శనిని చూడడం వల్ల ఈ రాశివారు ప్రతి విషయంలోనూ కార్యశూరులవుతారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నిటినీ గట్టి పట్టుదలతో చక్కబెట్టి, ఆర్థికంగా లాభం పొందుతారు. ఉద్యోగంలో తమ సమర్థతను నిరూపించుకుని ఉన్నత పదవులు చేపడతారు. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు ఆరవ స్థానంలో ప్రవేశించడం, శనితో పరస్పర వీక్షణ ఏర్పడడం వల్ల కొద్ది కాలం క్రితం ఈ రాశివారు చేసిన ప్రయత్నాలన్నీ ఇప్పుడు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు, సొంత ఇంటి కోసం చేసిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేసినా ఆశించిన ఫలితాలనిస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కూడా ఘన విజయాలు సాధిస్తారు.
- తుల: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న కుజుడు, షష్ట స్థానంలో ఉన్న శనీశ్వరుడు పరస్పరం వీక్షించు కోవడం వల్ల ఈ రాశివారు ఆర్థిక, వ్యక్తిగత, అనారోగ్య సమస్యల నుంచి కొద్ది ప్రయత్నంతో విముక్తి పొందే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి పట్టుదలగా కృషి చేసి అనుకున్నది సాధిస్తారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలను చేజిక్కించుకుంటారు. ప్రభుత్వంలో గానీ, బ్యాంకుల్లో గానీ ఆశించిన ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.
- వృశ్చికం: ధన స్థానంలో ఉన్న రాశ్యధిపతి కుజుడికి, పంచమ స్థానంలో ఉన్న శనికి మధ్య పరస్పర వీక్షణ ఏర్పడినందువల్ల ఈ రాశివారికి రాజయోగాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమర్థతను నిరూపించుకుంటారు. సీనియర్లను కాదని పదోన్నతులు పొందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలను లాభాల బాటపట్టిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు ఎక్కువగా వింటారు. సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. కొద్దిపాటి శ్రమతో వీరి ఆదాయం బాగా పెరుగుతుంది.
- కుంభం: ఈ రాశికి లాభ స్థానంలో ప్రవేశించిన కుజుడు, ధన స్థానంలో ఉన్న శని పరస్పరం వీక్షించుకోవడం వల్ల కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. సగటు వ్యక్తి సైతం కొద్ది శ్రమతో సంపన్నుడవుతాడు. పెండింగ్ పనులు, వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. అధికారులను తమ పనితీరుతో ఆకట్టుకుంటారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కోరుకున్న వ్యక్తిని పెళ్లాడడం, ఆశించిన ఉద్యోగం సంపాదించడం జరుగుతుంది.
- మీనం: ఈ రాశిలో ఉన్న శనీశ్వరుడు దశమ స్థానంలో ఉన్న కుజుడితో పరస్పర వీక్షణ పొందడం వల్ల ఈ రాశివారు ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీ దార్ల మీద పైచేయి సాధించి, లాభాలపరంగా దూసుకుపోతారు. తమకు రావలసిన సొమ్మును, బాకీలను పట్టుదలగా రాబట్టుకుంటారు. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి.