
Relationship Astrology
Image Credit source: Pixabay
Mars – Ketu Conjunction: ఈ నెల (జూన్) 7వ తేదీ నుంచి జూలై 28 వరకు సింహ రాశిలో కుజ కేతువులు యుతి చెందడం జరుగుతోంది. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులకు కుజ దోషం అంటే మాంగల్య దోషం పెరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో, ప్రయాణాల్లో, ఆహార విహారాల్లో, ఇతరులను నమ్మడంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృషభం, కర్కాటకం, సింహం, కన్య, మకరం, కుంభ రాశులవారి ఈ కుజ కేతువుల యుతి వల్ల కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ నెల 7 నుంచి జూలై 28న కుజుడు కన్యారాశిలోకి ప్రవేశించే వరకూ ఈ రాశుల వారు సుబ్రహ్మణ్యాష్టకం లేదా స్కంద స్తోత్రాన్ని పఠించడంతో పాటు తరచూ సుబ్రహ్మణ్యస్వామికి అర్చన చేయించడం మంచిది.
- వృషభం: ఈ రాశికి నాలుగవ స్థానంలో కుజ కేతువుల యుతి వల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరిగినప్పటికీ, కుటుంబ జీవితంలో మాత్రం సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఈ రెండు గ్రహాల కలయిక కుటుంబంలో సుఖ నాశనానికి దారి తీస్తుంది. దాంపత్య జీవితం కొద్దిగా ఒడిదుడుకులకు లోనవుతుంది. తల్లితో అకారణ శత్రుత్వం ఏర్పడుతుంది. ప్రయాణాల్లో వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది.
- కర్కాటకం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో కుజ కేతువుల కలయిక ఆదాయ వృద్ధికి తోడ్పడుతుంది కానీ, కుటుంబంలో అశాంతి, అలజడి ఏర్పడడానికి ప్రధాన కారణమవుతుంది. ఏ మాట అన్నా తప్పు అర్థం ఇచ్చే అవకాశం ఉంది. దంపతుల మధ్య వాదోపవాదాలు, కోపతాపాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. జీవిత భాగస్వామి అనారోగ్యంతో ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. ఏదో కారణం వల్ల దంపతుల మధ్య ఎడబాటు కలుగుతుంది. సహనంతో వ్యవహరించడం మంచిది.
- సింహం: ఈ రాశిలో కుజ కేతువుల యుతి వల్ల ఉద్యోగంలో పదోన్నతులు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందే అవకాశం ఉంది కానీ, వైవాహిక జీవితంలో ఈగోలు పెరగడం వల్ల మనస్పర్థలు తలెత్తడం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల జోక్యం వల్ల కూడా సమస్యలు తలెత్తడం జరుగుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ సమస్యల్ని ఓర్పుగా, నేర్పుగా పరిష్కరించుకోవలసి ఉంటుంది.
- కన్య: ఈ రాశికి వ్యయ స్థానంలో కుజ కేతువుల సంచారం వల్ల విపరీత రాజయోగం పట్టి వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడానికి అవకాశం ఉంటుంది కానీ, ఇది దంపతుల మధ్య తప్పకుండా కొంత కాలం పాటు ఎడబాటుకు దారితీస్తుంది. దంపతుల్లో ఒకరు దూర ప్రాంతానికి బదిలీ కావడం లేదా తరచూ ప్రయాణాలు చేయవలసి రావడం వల్ల అసంతృప్తి తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగ స్వామి మీద వైద్య ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. దాంపత్య సుఖం బాగా తగ్గే అవకాశం ఉంది.
- మకరం: ఈ రాశికి అష్టమ స్థానంలో కుజ కేతువుల సంచారం వల్ల ఆకస్మిక ధన లాభానికి, ఆస్తి సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంది కానీ, జీవిత భాగస్వామి అనారోగ్యాలతో ఇబ్బందిపడడమో, రోడ్డు ప్రమాదాలకు గురికావడమో జరుగుతుంది. ఇద్దరి మధ్యా ఎడబాటుకు అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఏదైనా తీవ్రస్థాయి సమస్యలో చిక్కుకుని మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా ఉంది. ప్రయాణాలను పెట్టుకోకపోవడం శ్రేయస్కరం.
- కుంభం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ కేతువులు కలవడం వల్ల ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదవులు చేపట్టడం, జీతభత్యాలు పెరగడం జరిగే అవకాశం ఉంది కానీ, దాంపత్య జీవితంలో టెన్షన్లు పెరిగే సూచనలున్నాయి. జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురి కావడం, ఇద్దరి మధ్యా అపార్థాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. దంపతుల మధ్య ఈగో సమస్యలు తలెత్తుతాయి. ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సి ఉంటుంది.